సంధ్య థియేటర్ ఘటనపై పోస్టులు పెడుతున్నారా..? అయితే మీకే ఈ హెచ్చరిక

సంధ్య థియేటర్ ఘటనపై పోస్టులు పెడుతున్నారా..? అయితే మీకే ఈ హెచ్చరిక

హైదరాబాద్: అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్ర రాజకీయాలతో పాటు సినీ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ టాపిక్‎పైనే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు కీలక సూచన చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం, ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు కొందరు సోషల్ మీడియాలో తప్పుడు వీడియోలు పోస్టు చేసిన అంశం మా దృష్టికి వచ్చింది.. ఈ ఘటనపై విచారణ క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో పోలీసు శాఖ ఇప్పటికే ప్రజల ముందు ఉంచింది.

 అయిన కొందరు ప్రజలను తప్పుదోవ పట్టించేలా అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు క్రియేట్ చేసిన కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా పోస్టులు చేస్తు్న్నారు. కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఇలాంటి ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంలో పోలీసు శాఖను బద్నాం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తే సీరియస్‎గా పరిగణిస్తామని స్పష్టం చేశారు. 

ALSO READ : తెలియదు..అనుకోలేదు..తప్పు జరిగింది!..తొక్కిసలాట ఘటనపై హీరో అల్లు అర్జున్ ​సమాధానాలివే

ఒక అమాయకురాలు మరణం, ఒక పిల్లవాడి ప్రాణానికి ప్రమాదం సంభవించిన ఈ కేసులో పోలీసు శాఖ ఎంతో నిబద్ధతతో విచారణ జరుపుతోందని.. దర్యాప్తు తప్పుబట్టేలా అసత్య ప్రచారాలు, అభూతకల్పనలతో సోషల్ మీడియా ద్వారా ఎవరైనా ప్రచారం చేస్తే సహించేది లేదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి ఏ పౌరుడి దగ్గరైనా ఆధారాలు, అదనపు సమాచారం ఉంటే పోలీసు శాఖకు అందించవచ్చని.. అంతేకానీ సొంత వ్యాఖ్యానాలు చేయవద్దని పోలీసు శాఖ తరపున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది పోలీస్ శాఖ.