గుంటూరు బయల్దేరిన పోలీసులు.. జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో విచారణ వేగవంతం..

గుంటూరు బయల్దేరిన పోలీసులు.. జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో విచారణ వేగవంతం..

  హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 , సెంట్రో గ్రాండీ ఎదురుగా బుధవారం 7 గంటలకు రెండు బైకులను ఓ స్పోర్ట్స్ కారు బలంగా ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో  కృష్ణానగర్ కి చెందిన అన్న ఉదయ్, చెల్లి స్వీటీ కలిసి ద్విచక్ర వాహనం మీద కలిసి వెళ్తుండగా పక్కనే వేరొక బైక్ పై కలిసి వెళ్తున్న ముగ్గురుని వైట్ కలర్ స్పోర్ట్స్ కార్ బలంగా ఢీ కొట్టి వాహనదారులను తొక్కుకుంటూ వెళ్లింది.

 బైక్ హెల్మెట్ కార్ కి వేలాడుతున్నా పట్టించుకోకుండా వేగంగా పారరయ్యాడు. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న అన్నా, చెల్లికి, వేరొక వాహనం పై ఉన్న వ్యక్తికి తల, కాలు పై బలంగా గాయాలయ్యాయి. బాధితులు రోడ్డు పై పడి ఉండటంతో తోటి వాహనదారులు అంబులెన్స్ కు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.  వాహనదారులు పోలీసుల సహాయంతో అంబులెన్స్ లో మాదాపూర్ ప్రైవేట్​ హాస్పిటల్ కి తరలించారు. 

ప్రస్తుతానికి ముగ్గురు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉంది. హిట్ అండ్ రన్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.  కారు గుంటూరుకు చెందిన వారిదిగా గుర్తించారు. కార్ నెంబర్ ఆధారంగా జూబ్లీహిల్స్ పోలీసుల బృందం గుంటూరుకు బయల్దేరారు. జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో వారం రోజుల వ్యవధిలోనే రెండు హిట్ అండ్ రన్ కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తుంది.