
వామ్మో హైదరాబాద్ జనాభా రోజురోజుకు పెరిగిపోతుంది.. జనసాంద్రత బాగా పెరిగిపోతోంది.చదరపుకిలోమీటరుకు అత్యధికంగా 18వేలకు పైగా జనాభా నివసిస్తున్నారు. ఇది దేశ రాజధాని ఢిల్లీ కంటే చాలా ఎక్కువ. పెరుగుతున్న పట్టణీకరణతో తెలంగాణలోని వివిధ ప్రాంతాలనుంచే కాకుండా వివిధ రాష్ట్రాలనుంచి వచ్చే వారితో హైదరాబాద్ నిండిపోతోంది.రాబోయే రోజుల్లో ఇది మరింత పెరగనుంది.. దీంతో వృద్ధుల జనాభా 80శాతం పెరిగే అవకాశాలున్నాయని, జనసాంద్రత ఆందోళన చెందే స్థాయిలో పెరుగుతుందని తాజా నివేదికలు చెబుతున్నాయి.
జనాభా సాంద్రతలో హైదరాబాద్ ఢిల్లీని మించిపోయింది. చదరపు కిలోమీటర్ కు18వేల161 ప్రజలు జీవిస్తున్నారు. మరోవైపు వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరగనుందన్న అంచనాలు, యువ జనభా తగ్గుదల ఉండనున్నట్లు నివేదికలు చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
తెలంగాణ స్టాటిస్టికల్ అబ్ స్ట్రాక్ట్ (ATLAS)2024 ప్రకారం..ఢిల్లీలో చదరపు కిలోమీటర్ కు 11వేల313 జనాభా ఉండగా.. హైదరాబాద్ లో చదరపు కిలోమీటర్ కు 18వేల161 మంది నివసిస్తున్నారు. దేశం విషయానికి వస్తే జనసాంద్రతలో ముంబై అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ చదరపు కిలోమీటర్ కు 28వేల 508 మంది నివసిస్తున్నారు. ప్రపంచంలో అయితే అత్యధికత జనసాంద్రత కలిగిన నగరం పిలిప్పీన్స్ లోని మనీలా. ఇక్కడ చదరపు కిలోమీటర్ కు 43వేలకు పైగా జనం నివసిస్తున్నారు.
వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ హైదరాబాద్ అభివృద్ది పథంలో నడుస్తుందన్న సంతోషపడ్డా.. దాని వెనకాలే నగరానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో మౌలిక సదుపాయాలు, పబ్లిక్ సర్వీస్ , గృహ నిర్మాణం వంటి సమస్యలు తలెత్తున్నాయని టౌన్ ప్లానర్లు అంటున్నారు.
హైదరాబాద్‌లో అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ సెక్టార్ దాని సాంస్కృతిక,చారిత్రక ప్రాముఖ్యతతో పాటు, నిపుణులు, విద్యార్థులు,వ్యవస్థాపకులను ఒక అయస్కాంతంగా మారుస్తుందని నిపుణులు అంటున్నారు. హైదరాబాద్ జనాభా సాంద్రత పెరుగుతున్నప్పటికీ, తెలంగాణలో మాత్రం జనాభా తగ్గుదల సమస్యలు ఎదుర్కొంటుందని నివేదికలు చెబుతున్నాయి.
మరోవైపు 2031 నాటికి తెలంగాణలో జనాభా తగ్గుదల కనిపిస్తుంది..జాతీయ జనాభాలో రాష్ట్ర వాటా 0.23 శాతం పాయింట్లు తగ్గుతుందని అంచనా.యువజనాభా తగ్గి, 40యేళ్ల పైబడిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని చెబుతున్నాయి. ముఖ్యంగా 80 యేళ్లు నిండిన వారి సంఖ్య తెలంగాణ ఎక్కువగా ఉండబోతోందని, వీరి సంఖ్య ఏకంగా 80శాతం పెరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి. ఇది రాబోయే దశాబ్దాలలో తెలంగాణ ఎదుర్కొనే వృద్ధాప్య జనాభాకు సంకేతంగా కనిపిస్తోంది.
2011 జనాభా లెక్కల ప్రకారం.. తెలంగాణ జనాభా 3.5 కోట్లు.1లక్షా 12వేల 077 చదరపు కిలోమీటర్లు భౌగోళిక ప్రాంతం ఉంది. సగటున చదరపు కిలోమీటరుకు 312 మంది జనాభా సాంద్రత ఉంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. 300 మంది చదరపు కిలోమీటర్ల సాంద్రత కలిగిన అత్యల్ప 10 రాష్ట్రాలలో ఒకటి తెలంగాణ.- జనాభా ఒత్తిడి ఎక్కువగా ఉన్న బీహార్ లేదా పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ.
2031 నాటికి తెలంగాణ జనాభా 3.92 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేయబడింది. అయితే జాతీయ జనాభా వాటాలో స్వల్ప తగ్గుదలను సూచిస్తుంది. 2021లో 2.77శాతం ఉన్న జనాభా 2031లో 2.66శాతానికి తగ్గుతుందని నివేదికలు చెబుతున్నాయి. ప్రత్యేకించి ఐదేళ్ల లోపు పిల్లల జనాభా 21 శాతం తగ్గనుంది. అయితే 60యేళ్లకు పైబడిన వృద్ధుల జనాభా 60 శాతంపైగా పెరుగుతుందట. ఈ జనాభా మార్పు చాలా తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది.
తెలంగాణజనాభాలో ఈ మార్పులు కీలక పరిణామాలకు దారి తీస్తాయని నిపుణులు చెబుతున్నారు. వృద్దులు, యువత అవసరాల తీర్చడం, వృద్ధి, స్థిరత్వాన్ని సమతుల్యం చేయడం ఓ సవాల్ గా మారుతుందని అంటున్నారు.