ప్రత్యంగిరా దేవిని శ్రీరాముడు, హనుమంతుడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు లాంటి వాళ్లంతా పూజించారని పురాణాలు చెప్తున్నాయి. ఆమెకు సంబంధించిన ఆలయాలు హిమాలయాల్లోని మానస సరోవరం, తమిళనాడులోని కుంభకోణం, హోసూరులాంటి ప్రదేశాలలో మాత్రమే ఉన్నాయి. కానీ ఆ దేవి ఆలయం హైదరాబాద్ లో కూడా ఉంది. ఇప్పుడు ఆదేవాలయం విశేషాలను తెలుసుకుందాం. . .
హైదరాబాద్.. దిల్సుఖ్ నగర్ లోని రామకృష్ణాపురం రోడ్లో అమ్మవారి దేవాలయం ఉంది. కోర్కెలు తీర్చే అమ్మవారు...ఉగ్రరూపంలో ఉన్న ప్రత్యంగిరా దేవి విగ్రహాన్ని ప్రత్యేకంగా కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డలో చెక్కించిఇక్కడ ప్రతిష్ఠించారు.సింహంముఖంతో, త్రిశూలం ధరించి, కపాలమాలతో కనిపిస్తుంది. పక్కనే శివుడు, రతీ మన్మథులు, కాలభైరవుడు, కాళికాదేవి విగ్రహాలు కూడా ఉన్నాయి. గర్భాలయంలోకి వెళ్లే ద్వారంపై వెండితో చేసిన తొడుగులపై దశమహావిద్యలు కనిపిస్తాయి.
లక్ష్మీ గణపతులు, అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. భక్తులు వీటికి నమస్కరించి గర్భాలయంలోకి అడుగుపెడతారు. ఆదిపరాశక్తి బ్రహ్మ, విష్ణు, శివులను సృష్టించిన దేవత. సృష్టి, స్థితి, లయకారిణి అయిన ప్రత్యంగిరా దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటారు. సరస్వతి, లక్ష్మి, పార్వతుల కలయికైన ప్రత్యంగిరాదేవి తమ కోర్కెలు తీరుస్తుందని భక్తులు నమ్ముతారు. అలాగే విద్య, వ్యాపారం, ఆరోగ్యం, వివాహాలకు సంబంధించిన ఆటంకాలను ఈ దేవి తొలగిస్తుందని కూడా నమ్ముతారు.అద్భుతశక్తులు కలిగి, శని పీడల నుంచి దూరం చేస్తున్న ప్రత్యంగిరా దేవి ఆలయం తెలుగునేలపై నిర్మించారు.
ప్రత్యంగిరాదేవి సింహ ముఖంతో, మనిషి రూపంలో ఉండటానికి ప్రత్యేకమైన కథ ఉంది. నరసింహస్వామి హిరణ్యకశిపుడిని వధించినా కోపం తగ్గదు. కోపం తగ్గించడానికి శివుడు.. శరభేశ్వరుడిగా అవతరించి నరసింహస్వామిని యుద్ధంలో ఓడించాడు. ఆ యుద్ధంలో అమ్మవారు శూలిని, మహాప్రత్యంగిగా అవతరించి శరభేశ్వరుడికి అండగా నిలిచింది. అలాగే ఆ అమ్మవారిని మొదటిసారిగా ప్రత్యంగిరా, అంగీరసుడుఅనే మునులు చూడ్డం వల్ల వాళ్ల పేర్లతో కలిసి ప్రత్యంగిరాదేవి అనే పేరు వచ్చిందని చెప్తారు.