హైదరాబాద్ లో గంటకు పైగా కుండపోత వాన..చెరువులను తలపిస్తున్న రోడ్లు

హైదరాబాద్ లో గంటకు పైగా  కుండపోత వాన..చెరువులను తలపిస్తున్న రోడ్లు

హైదరాబాద్‎ వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురిసింది. గంటకు పైగా ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి రోడ్లలననీ చెరువులను తలపించాయి. లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, తార్నాక, నాచారం ఏరియాల్లో పెద్దఎత్తున ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఖైరాతాబాద్, బంజారాహిల్స్, మెహిదీపట్నం, జూబ్లీహిల్స్ ఏరియాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అబిడ్స్ నుండి నాంపల్లి స్టేషన్ రోడ్ కు వెళ్లే మార్గంలో ఉన్న కమత్ హోటల్ లో మోకాళ్ళ లోతు వర్షం నీరు చేరింది. పంజాగుట్ట దగ్గర భారీగా నీరు నిలిచిపోవడంతో రోడ్డు చెరువును తలపిస్తోంది. 

నగరంలో భారీ వర్షాలకు జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో  సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షాలు ఉన్నందున ప్రజలు అత్యవసరమైతేనే ఇండ్ల నుంచి బయటకు రావాలని సూచించారు.

ALSO READ : హైదరాబాద్‎లో భారీగా ట్రాఫిక్ జామ్.. కిలో మీటర్ల మేర నిలిచిన వాహనాలు

అటు జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లో భారీవానకు రోడ్లపై ఆరబోసిన మక్కలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కోనాపూర్ గ్రామంలో భారీవర్షానికి పిడుగుపడి ఓ గెదె మృతి చెందింది. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండలం నాగదార్ గ్రామశివారులో పిడుగుపడి 20 మేకలు చినపోయాయి. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో పిడుగుపాటుకు రెండు గేదెలు మృతిచెందాయి. మరోవైపు చేతికొచ్చిన పంట నీటిపాలవ్వడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.