పక్కా ప్లాన్​ ప్రకారమే..ఐజీ సత్యనారాయణ వెల్లడి

  • సురేశ్ ​కోసం 4 స్పెషల్​ టీమ్స్​తో గాలిస్తున్నం​ 
  • ఘటనపై ప్రభుత్వానికి పూర్తి నివేదిక ఇస్తం

లగచర్ల ఘటన పక్కా పథకం ప్రకారమే జరిగిందని హైదరాబాద్‌‌ రేంజ్‌‌ ఐజీ సత్యనారాయణ స్పష్టం చేశారు. కలెక్టర్‌‌ ప్రతీక్ జైన్‌‌‌‌పై దాడి, కర్రలు, రాళ్లతో అధికారుల వాహనాల విధ్వంసం వెనుక కుట్ర ఉన్నదని  వెల్లడించారు. పక్కా ప్లాన్‌‌ ప్రకారమే విధ్వంwసానికి పాల్పడ్డారని తెలిపారు. దీని వెనుక స్థానిక బీఆర్ఎస్ నేత సురేశ్​ కీలకంగా వ్యవహరించినట్టు గుర్తించామన్నారు. 57 మందిని అదుపులోకి తీసుకుని దాడికి పాల్పడిన 16 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. ఈ ఘటనపై మంగళవారం మంత్రి శ్రీధర్‌‌‌‌బాబుతో భేటీ అయిన అనంతరం ఐజీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. 

సురేశ్​ కావాలనే కలెక్టర్‌‌‌‌ను గ్రామంలోకి తీసుకెళ్లినట్టు గుర్తించామని తెలిపారు.ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం ఎక్కడా లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే 3 నాన్ బెయిలెబుల్ కేసులు నమోదు చేశామని తెలిపారు. సురేశ్  పరారీలో ఉన్నాడని, అతడికోసం గాలిస్తున్నట్టు చెప్పారు.ఈ ఘటనలో బీఆర్‌‌‌‌ఎస్‌‌ నేత సురేశ్​ను ప్రధాన నిందితుడిగా చేర్చినట్టు తెలిపారు. సురేశ్​ బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా ఉన్నాడని, యూత్ లీడర్‌‌గా పనిచేస్తున్నాడని చెప్పారు. వికారాబాద్ కలెక్టర్ పై దాడి ఘటన, ఓ కిడ్నాప్  కేసులో సురేశ్​ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

కర్రలు,రాళ్లతో దాడులకు పాల్పడిన వారిని ఇప్పటికే గుర్తించామని చెప్పారు. వీరందరి కాల్ డేటాను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. వికారాబాద్‌‌ ఎస్పీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో 4 స్పెషల్‌‌ టీమ్స్‌‌ ఏర్పాటు చేశామని తెలిపారు. సురేశ్​తోపాటు మరికొంత మంది కోసం గాలిస్తున్నామని చెప్పారు.ఈ ఘటనలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవహరించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు.