హైదరాబాద్ ఓటమితో ముగింపు

హైదరాబాద్ ఓటమితో ముగింపు

నాగ్‌‌పూర్‌‌‌‌: రంజీ ట్రోఫీని హైదరాబాద్ జట్టు ఓటమితో ముగించింది. మెగా టోర్నీలో నాకౌట్ చేరలేకపోయిన హైదరాబాద్ గ్రూప్ దశ చివరి మ్యాచ్‌‌లో 58 రన్స్ తేడాతో విదర్భ చేతిలో పరాజయం పాలైంది. ఆ జట్టు ఇచ్చిన 220 రన్స్ టార్గెట్ ఛేజింగ్‌‌లో 23/1తో నాలుగో రోజు, ఆదివారం ఆట కొనసాగించిన హైదరాబాద్ అనూహ్యంగా తడబడింది. విజయానికి మరో 197 రన్స్ అవసరం అవ్వగా రెండో ఇన్నింగ్స్‌‌లో 38.5 ఓవర్లలో 161 రన్స్‌‌కే కుప్పకూలింది.

రాహుల్ రాదేశ్ (48), మహ్మద్ సిరాజ్ (26), సీవీ మిలింద్ (20) మాత్రమే ప్రతిఘటించారు. విదర్భ బౌలర్లలో హర్ష్‌‌ దూబే (6/57) ఆరు వికెట్లతో హైదరాబాద్‌‌ను దెబ్బకొట్టాడు. అతనికే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఏడు మ్యాచ్‌‌ల్లో ఆరో విజయంతో విదర్భ నాకౌట్‌‌ చేరుకోగా.. 2 విజయాలు, 2 డ్రాలు, 3 ఓటములతో హైదరాబాద నాలుగో స్థానంతో సరిపెట్టింది.