హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో దొంగలుపడ్డారు.. రెండు కోట్ల డబ్బు సంచులు దోచుకెళ్లారు..

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో దొంగలుపడ్డారు.. రెండు కోట్ల డబ్బు సంచులు దోచుకెళ్లారు..

మేడ్చల్ జిల్లా: మేడ్చల్ జిల్లాలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని ఇల్లంతా దోచేశారు. మక్త గ్రామంలోని ఓ ఇంట్లో రెండు కోట్ల డబ్బు, 28 తులాల బంగారాన్ని కాజేశారు. ఈ ఘటనతో బాధిత కుటుంబం లబోదిబోమంది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మక్త గ్రామంలో నాగభూషణం ఇంట్లో భారీ చోరీ జరిగింది. రెండు కోట్ల నగదు, 28 తులాల బంగారం చోరీ అయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి క్లూస్ టీం సభ్యులు చేరుకున్నారు.

ఈ చోరీపై మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి మాట్లాడుతూ.. చోరీ జరిగిందని తెల్లవారు జామున పోచారం పోలీసులకు బాధితుడు నాగభూషణం సమాచారం అందించినట్లు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, క్లూస్ టీం అంతా స్పాట్కు చేరుకుని.. చోరీ ఎలా జరిగిందని ఆరా తీసినట్లు చెప్పారు. నాగభూషణం కొడుకు హైదరాబాద్లో ఐటీ రంగంలో పని చేస్తున్నాడు. 

శంకర్పల్లిలో ఇటీవల వారికి ఉన్న భూమి అమ్మగా డబ్బులు వచ్చాయని, కొడుకు కారు డ్రైవర్తో డబ్బులు హైదరాబాద్ నుంచి వాళ్ల తండ్రికి పంపాడని మల్కాజ్గిరి ఏసీపీ తెలిపారు. వేరే చోట భూమి కొనడానికి ఇంట్లో డబ్బులు పెట్టుకున్నారని, ఇంతలోనే చోరీ జరిగిందని చెప్పారు.