
Hyderabad Real Estate: హైదరాబాద్ రియల్టీ మార్కెట్ గడచిన కొన్ని నెలలుగా నెమ్మదించింది. దీంతో నగరంలో అమ్ముడుపోని రెసిడెన్షియల్ ప్రాపర్టీల సంఖ్య భారీగా పెరిగిందని డేటా చెబుతోంది. అయితే దేశంలోని మిగిలిన మెట్రో నగరాల్లో వీటి సంఖ్య తగ్గుతోంది. అయితే గడచిన ఏడాది కాలంలో సరసమైన ధరల్లో ఉన్న అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 19 శాతం తగ్గుదలను చూసింది. కానీ హైదరాబాదులో మాత్రం పరిస్థితి రివర్సులో ఉంది.
బెంగళూరులో మాత్రం సరమైన ధరల్లో ఇళ్లకు డిమాండ్ కారణంగా వాటి స్టాక్స్ 50 శాతానికి పైగా తగ్గగా, దీని తర్వాత చెన్నైలోనూ ఈ కేటగిరీ ఇళ్లకు మంచి డిమాండ్ కనిపించింది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో సరసమైన ఇళ్ల సేల్స్, కొత్త ప్రాజెక్టుల లాంట్ భారీగా తగ్గిందని అనరాక్ గ్రూప్ చైర్మన్ అంజు పూరీ పేర్కొన్నారు.
జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో హైదరాబాదులో 10వేల 647 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే ఏకంగా 26 శాతం తగ్గుదల. హైదరాబాదులో రియల్టీ నెమ్మదించటానికి అనేక కారణాలను నిపుణులు చెబుతున్నారు. వారి ప్రకారం ముందుగా హోమ్ లోన్ వడ్డీ రేట్లలో మార్పులు, కొనుగోలుదారుల అప్రమత్తత తీరు, కొత్త ప్రాజెక్టుల లాంచ్ విషయంలో ఆలస్యాలతో తాత్కాలికంగా రియల్టీ డిమాండ్ తగ్గించింది. అయితే రానున్న నెలల్లో మార్కెట్ రికవరీతో తిరిగి హౌసింగ్ డిమాండ్ పుంజుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తగ్గిన రిజిస్ట్రేషన్లు..
మార్చి నెలలో ఏడాది ప్రాతిపదికన హైదరాబాదులు రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు 8 శాతం తగ్గాయని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదించింది. అయితే రూ.కోటి కంటే విలువైన ప్రీమియం ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 17 శాతం పెరిగాయని పేర్కొంది. అయితే రూ.50 లక్షల కంటే తక్కువ రేటులో ఉన్న ప్రాపర్టీలకు డిమాండ్ గత ఏడాది మార్చితో పోల్చితే 14 శాతం తక్కువగా ఉందని వెల్లడైంది. అయితే నగరంలో 2వేల చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్త్రీర్ణం కలిగిన ప్రాపర్టీలకు డిమాండ్ పెరుగుతున్నట్లు అమ్మకాల గణాంకాలు చెబుతున్నాయి. మెుత్తానికి హైదరాబాద్ మార్కెట్ పెద్ద, హెఎండ్ రెసిడెన్షియల్ హౌసింగ్ యూనిట్ల వైపు మొగ్గు చూపుతోందని తేలింది.