కాశ్మీర్ ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి

కాశ్మీర్ ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి

హైదరాబాద్:జమ్మూకాశ్మీర్ లోని అనంత్నాగ్ జిల్లాలోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 27 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి తీవ్ర బుల్లెట్ గాయాలయ్యాయి. మృతుల్లో హైదరాబాద్ కు ఐడీ అధికారి కూడా ఉన్నారు. మృతుడు ఐబీ అధికారి మనీష్ రంజన్గా గుర్తించారు. మనీష్‌ రంజన్‌ ని తన భార్య, ఇద్దరు పిల్లల ఎదురుగానే కాల్చి చంపినట్లు తెలుస్తోంది. 

మంగళవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం 2గంటల సమయంలో బైసారన్ టూరిస్టు ప్రాంతంలో ఉన్న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మృతిచెందిన టూరిస్టుల మృతదేహాలతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమయింది. కాల్పులు జరపొద్దని తమ వారిని విడిచిపెట్టాలని పలువురు టూరిస్టులు విజ్ణప్తి చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  నాభర్తను చంపారు నన్ను కూడా చంపండి నేను చచ్చిపోతానని ఓ మహిళ విలపిస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. విషయం తెలుసుకున్న హోంమంత్రి హుటాహుటిన జమ్మూకాశ్మీర్ కు వెళ్లారు. ఉగ్రదాడిలో గాయపడిన వారిని పరామర్శించారు. 

మరోవైపు కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాకు చెందిన మంజునాథ్ రావు అనే వ్యాపారవేత్త కూడా పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మృతి చెందాడు. మంజునాథ్ రావు మృతికి సీఎం సిద్ధరామయ్య సంతాపం తెలిపారు.కర్ణాటక ప్రభుత్వం నుంచి అధికారుల బృందం కాశ్మీర్‌కు బయలుదేరిందని తెలిపారు. 

పహల్గా ఉగ్రదాడిని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. పౌరులే లక్ష్యంగా ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి అని ఒమర్ అబ్ధుల్లా అన్నారు.ఇది ఉగ్రవాదుల పనే స్పష్టం చేశారు.  మరోవైపు ప్రధాని మోదీ ఈ ఘటన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.