పలుకుబడితో ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నరు

 పలుకుబడితో ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నరు
  • స్కూళ్లలోని ఆట స్థలాలను కూడా వదలట్లేదు 
  • హైడ్రా ప్రజావాణిలో పలువురు ఫిర్యాదు

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా ఆఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 63 ఫిర్యాదులు వచ్చాయి. అడిషనల్ డైరక్టర్ పాపయ్య ఫిర్యాదులను స్వీకరించారు. స్థానికంగా ప‌లుకుబ‌డి ఉన్న వ్యక్తులు ప్రభుత్వ భూములను క‌బ్జా చేస్తున్నార‌ని వాటిని కాపాడాల‌ని పలువురు ఫిర్యాదు చేశారు. పాఠ‌శాలల్లో పిల్లలు ఆడుకునేందుకు కేటాయించిన స్థలాలను కూడా వ‌ద‌ల‌డంలేద‌ని పేర్కొన్నారు. వ్యవ‌సాయం చేసుకోవ‌డానికి మాత్రమే ప‌రిమిత‌మ‌వ్వాల్సిన శిఖం భూముల్లో సమీపంలోని స‌ర్వే నంబ‌ర్​చూపించి అనుమ‌తులు తీసుకుని ఇళ్లు క‌ట్టేస్తున్నార‌ని ఫిర్యాదులు అందాయి. 

అబ్దుల్లాపూర్ మెట్ మండ‌లం ఇంజాపూర్ లో స్కూల్​ను ఆనుకుని ఉన్న 14  గుంట‌ల ప్రభుత్వ స్థలాన్ని స్థానిక ప్రజా ప్రతినిధి క‌బ్జా చేస్తున్నాడ‌ని స్థానికులు ఫిర్యాదు చేశారు. ప‌లుమార్లు కాపాడి ప్రభుత్వ స్థలం అని బోర్డు పెట్టినా మ‌ళ్లీ అదే ప‌ని చేస్తున్నాడ‌ని పేర్కొన్నారు. పాఠ‌శాల విస్తర‌ణ‌కు, పిల్లల ఆట స్థలానికి ఉప‌యోగ‌ప‌డేలా చూడాల‌ని కోరారు. మియాపూర్– -బీహెచ్ఈఎల్ హైవేలోని గంగారాం చెరువు ఎఫ్‌టీఎల్ ఎగువన ఇంటి స్థలాలున్న నిర్మాణానికి అనుమ‌తులివ్వడం లేద‌ని ప‌లువురు ఫిర్యాదు చేశారు. 

గతంలో గ్రామ‌ పంచాయ‌తీ లే ఔట్‌కు ఎల్ఆర్ఎస్ క‌ట్టించుకుని రెగ్యులరైజ్ చేశార‌ని, తమకు మాత్రం అనుమ‌తించ‌డంలేద‌ని పేర్కొన్నారు. కీస‌ర మండ‌లం, నాగారం మున్సిపాలిటీలోని అన్నరాయ చెరువులో తన ఎక‌రం శిఖం భూమిని ప‌క్కనే లేఅవుట్ వేసిన వ్యక్తి ఆక్రమించి, ప్లాట్ల మాదిరి అమ్మేస్తున్నార‌ని, ఇప్పటికే ప‌లు నిర్మాణాల చేపట్టారని అన్నం రాజు హ‌రిబాబు అనే వ్యక్తి హైడ్రాకు ఫిర్యాదు చేశారు. మేడిప‌ల్లిలోని ఊర‌చెరువు పాత నాలాను పున‌రుద్ధరించాల‌ని ప‌లువురు కోరారు. దిగువన ఉన్న 6 కాల‌నీలకు వ‌ర‌ద‌, మురుగు ముప్పు లేకుండా చూడాలన్నారు. 

జీహెచ్ఎంసీ ప్రజావాణికి 68

జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 68 ఫిర్యాదులు అందాయి. టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి 26, ట్యాక్స్ సెక్షన్ కు16, ఇంజినీరింగ్, హెల్త్ విభాగాలకు 4 చొప్పున, శానిటేషన్ విభాగానికి 3, యూబీడీ, ఎలక్ట్రికల్, లేక్స్, ఐటీ విభాగాలకు 2 చొప్పున, అడ్మినిస్ట్రేషన్, విజిలెన్స్, ట్రాన్స్ పోర్ట్ విభాగాలకు ఒకటి చొప్పున ఫిర్యాదులు అందాయి. ఫోన్ ఇన్ ద్వారా 4  ఫిర్యాదులు వచ్చాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో మొత్తం 108  ఫిర్యాదులు వచ్చాయి. హెడ్డాఫీసులో అడిషనల్ కమిషనర్లు శివకుమార్ నాయుడు, వేణుగోపాల్, రఘు ప్రసాద్, చంద్రకాంత్ రెడ్డి, యాదగిరి రావు, అడిషనల్ సీసీపీలు ఫిర్యాదులు స్వీకరించారు.

మేయర్ కనిపించట్లేదని కార్పొరేటర్ ఫిర్యాదు

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కనిపించడం లేదని మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ హెడ్డాఫీసులోని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నగరంలోని సమస్యలను మేయర్ దృష్టికి తీసుకెళ్దామంటే అపాయింట్ మెంట్ దొరకడం లేదన్నారు. 

హైదరాబాద్​లో 98.. రంగారెడ్డిలో 72

హైదరాబాద్​కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణికి 98 అర్జీలు వచ్చాయి. వీటిలో గృహ నిర్మాణ శాఖకు 31, పెన్షన్‌కు 24, డీసీఎస్ఓకు 4,  ఇతర శాఖలకు సంబంధించి 39 దరఖాస్తులు ఉన్నాయి. కలెక్టర్ అనుదీప్, అడిషనల్​కలెక్టర్లు కదిరివన్ పలని, జి.ముకుంద రెడ్డి ఫిర్యాదులు స్వీకరకించారు. రంగారెడ్డి కలెక్టరేట్ ప్రజావాణికి 72 అర్జీలు అందాయి. కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అడిషనల్​కలెక్టర్ ప్రతిమాసింగ్ పాల్గొన్నారు.