హైదరాబాద్ లో దోమల బాధ.. నివారణలో జీహెచ్ఎంసీ విఫలం

  • మూలకు పడ్డ మస్కిటో ట్రాప్ మెషీన్లు  
  • సీజన్ ​ముగుస్తున్నా జాడ లేని   ఆధునిక యంత్రాలు 
  • కనిపించని చెరువులు,  కుంటలపై డ్రోన్ల స్ర్పే
  • చాలా చోట్ల ఫాగింగ్ చేయడం లేదంటున్న సిటీ జనాలు  
  • ఏడాదికి రూ.30 కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం సున్నా 
  • పెరుగుతున్న డెంగీ కేసులు 

 హైదరాబాద్ సిటీ, వెలుగు :గ్రేటర్ హైదరాబాద్​లో జనాలు దోమలుతో సతమతమవుతున్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా  గ్రౌండ్ లెవెల్​లో మాత్రం రియాలిటీ వేరే విధంగా ఉంది. ఒకవైపు నగరం డెంగీ కేసులతో వణికిపోతుంటే జీహెచ్ఎంసీ సీరియస్​గా తీసుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దోమల నివారణకు మూడేండ్ల కింద గ్రేటర్​లో  ఏర్పాటు చేసిన మస్కిటో ట్రాపింగ్ మెషీన్లు జాడ లేకుండా పోయాయి.

అప్పట్లో జోన్​కు రెండు చొప్పున 12 మస్కిటో ట్రాపింగ్ మెషీన్లు కొన్నా..ఆపరేట్ చేయకపోవడంతో మూలకుపడ్డాయి. చెరువులు, కుంటల వద్ద దోమలను చంపడానికి గతేడాది వరకు రెగ్యులర్​గా డ్రోన్లతో స్ప్రే చేసినా..ఇప్పుడు దాన్ని నామమాత్రం చేశారు. దీంతో దోమల వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. నగరంలో దోమలు లేకుండా చేయడానికి అత్యాధునిక టెక్నాలజీ వాడతామని జీహెచ్ఎంసీ ఈ సీజన్ మొదట్లో చెప్పినప్పటికీ మరో నెలయితే సీజన్ అయిపోవస్తున్నా వాటి ఆచూకీ కనిపించడం లేదు.  

ఫాగింగ్ చేస్తే ఒట్టు..

డివిజన్లలో చాలా చోట్ల రెగ్యులర్​గా ఫాగింగ్ చేయకపోవడం, కొన్నిచోట్ల నామ్ కే వాస్తేగా చేస్తుండడంతో దోమల సంఖ్య పెరిగిపోతోంది. దోమల బాధ పడలేకపోతున్నామని ఫిర్యాదు చేసినా ఫాగింగ్ చేయడం లేదని, వారానికోసారి కూడా తమ కాలనీల వైపు రావడం లేదని  జనాలు చెబుతున్నారు. మూడేండ్ల కింద డివిజన్​కి ఒక్క చిన్న ఫాగింగ్​ మెషీన్​ చొప్పున  మొత్తం 150 యంత్రాలుండేవి. ప్రస్తుతం డివిజన్​కు రెండు పెంచగా మొత్తం 300 ఫాగింగ్​ యంత్రాలు ఉన్నాయి. అలాగే  పెద్ద మెషీన్లు సర్కిల్​కి రెండు చొప్పున 60 ఉన్నాయి. ఇన్ని ఉన్నా ఫాగింగ్ ​సరిగ్గా చేయకపోవడంతో దోమలతో అల్లాడుతున్నామని  ఆయా బస్తీల జనాలు ఆరోపిస్తున్నారు.

గ్రేటర్​లో పరిస్థితి ఇలా ఉంటే శివారులోని బోడుప్పల్, ఫీర్జాదిగూడ, జవహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్, నిజాంపేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బడంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట, బండ్లగూడ జాగీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 23 మున్సిపాలిటీల్లోని కొన్ని కాలనీల్లో నెలకోసారి కూడా ఫాగింగ్ చేయట్లేదంటున్నారు. మరోవైపు వర్షాలతో చాలాచోట్ల నీరు నిలిచిపోయి దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. యేటా జులై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి.

కొద్దిరోజులుగా సర్కారు దవాఖానలకు డెంగీతో వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. గ్రేటర్​లో ఈ ఏడాది ఇప్పటి వరకు1143 కేసులు మాత్రమే నమోదయ్యాయని జీహెచ్ఎంసీ చెబుతుండగా అనధికారిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య 2వేలకిపైగా ఉంటుందని తెలుస్తోంది. దీనికంతటికీ కారణం దోమలే. వీటి నివారణలో కీలకపాత్ర పోషించే ఎంటమాలజీ డిపార్ట్​మెంట్ బాస్ మాత్రం పనులన్నీ జోనల్ స్థాయిలోనే జరుగుతాయని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

కోట్లు ఖర్చు చేసినా...

గ్రేటర్​లో దోమ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నివార‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ కోసం ప్రతి యేడూ జీహెచ్ఎంసీ  రూ.కోట్లు ఖర్చు చేస్తోంది. 2020-21లో రూ.25 కోట్లు, 2021-22లో రూ.25 కోట్లు, 2022-23లో రూ.30 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ ఏడాది కూడా దోమల పేరుతో క్రితం సారి కంటే ఎక్కువగానే ఖర్చు చేస్తోంది. అయినా దోమల బెడద మాత్రం తగ్గడం లేదు. దీంతో పాటు డెంగీ కేసులు కూడా పెరుగుతున్నాయి.

గ్రేటర్​లోని 4850 కాలనీల్లో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని, డెంగ్యూ కేసులు నమోదైన 24 గంటల్లోపు ఎక్కడైతే డెంగ్యూ సోకిందో అక్కడ పారిశుధ్య చర్యలు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నారు. కూలర్లు, టైర్లు, తాగి పడేసిన కొబ్బరి బొండాల్లో నీరు చేరడం, నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో దోమలు వ్యాప్తి చెందకుండా చేస్తున్నామని చెబుతున్నా..అలాంటివి ఎక్కడా కనిపించడం లేదు.