డిజిటల్ అరెస్ట్​ పేరిట హైదరాబాద్ రిటైర్డ్ ​ఉద్యోగికి రూ.1.38 కోట్ల టోకరా

డిజిటల్ అరెస్ట్​ పేరిట హైదరాబాద్ రిటైర్డ్ ​ఉద్యోగికి రూ.1.38 కోట్ల టోకరా

గచ్చిబౌలి, వెలుగు: డిజిటల్​అరెస్ట్​పేరుతో బెదిరించి సిటీకి చెందిన ఓ రిటైర్డ్ ఇంజనీర్‎ను సైబర్​నేరగాళ్లు చీట్ చేశారు. అతని అకౌంట్స్ నుంచి రూ.1.38 కోట్లు కొట్టేశారు. సైబరాబాద్ సైబర్​క్రైమ్ పోలీసుల కథనం ప్రకారం.. కొన్నాళ్ల కింద సిటీకి చెందిన రిటైర్డ్​ఇంజనీర్(82)కు ఓ వ్యక్తి వాట్సాప్ ​కాల్ చేశాడు. ఎస్ బీఐ ప్రతినిధిని అంటూ పరిచయం చేసుకున్నాడు. ‘మీ బ్యాంక్​ అకౌంట్ల ద్వారా మనీ లాండరింగ్​జరిగింది. మీపై కేసు నమోదైంది’ అని భయపెట్టాడు. ముంబై సైబర్​ క్రైమ్ ఆఫీసర్ మాట్లాడతాడంటూ మరో వ్యక్తితో మాట్లాడించాడు. మనీ లాండరింగ్​ జరిగిందని, ఆధార్ ​వివరాలు ఇవ్వాలని, చెక్​చేస్తామని నమ్మబలికాడు.

భయపడిపోయిన వృద్ధుడు ఆధార్ వివరాలు చెప్పాడు. తర్వాత వారు చెప్పిన వివిధ బ్యాంక్​అకౌంట్లకు రూ.1.38 కోట్లు బదిలీ చేశాడు. తర్వాత తాను మోసపోయినట్లు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు ట్రాన్స్​ఫర్ చేసిన డబ్బును సైబర్​క్రిమినల్స్​వేర్వేరు బ్యాంక్​అకౌంట్లకు మళ్లించినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. 

రూ.9.60 లక్షలను తమిళనాడులోని నమక్కల్​కు చెందిన గోకుల్​మారుతాచలమూర్తి(24) ఫెడరల్ బ్యాంక్​అకౌంట్‎కి బదిలీ కాగా, రాహుల్ అనే వ్యక్తి విత్​డ్రా చేశాడని గుర్తించారు. గోకుల్ తన బ్యాంక్​అకౌంట్లు, పాస్​బుక్‎లు, చెక్​బుక్‏లు, ఏటీఎం కార్డులను కమీషన్ పద్దతిలో జాఫర్​షరీఫ్, షారుఖాన్​అనే ఇద్దరికి ఇచ్చాడని తేల్చారు. వారిద్దరు రాహుల్‎తో కలిసి సైబర్​నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. గోకుల్, జాఫర్​షరీఫ్(23), షారూఖాన్(30)ను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు రాహుల్​పరారీలో ఉన్నాడు.