రోడ్ల మెయింటెనెన్స్​ జీహెచ్ఎంసీదే.. గత నవంబర్​తో ముగిసిన ఏజెన్సీల గడువు

రోడ్ల మెయింటెనెన్స్​ జీహెచ్ఎంసీదే.. గత నవంబర్​తో ముగిసిన ఏజెన్సీల గడువు
  • గత నవంబర్​తో ముగిసిన ఏజెన్సీల గడువు 
  • 812 కిలోమీటర్లకు రూ.1,839 కోట్లు చెల్లింపు
  •  నిర్వహణ సరిగ్గా లేదని ఫిర్యాదులు  
  • కొనసాగించడానికి ఆసక్తి చూపని సర్కారు
  • ప్రస్తుతం నిర్వహణను చూస్తున్న జీహెచ్ఎంసీ ఇంజినీర్లు

హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్​లో సీఆర్ఎంపీ (కాంప్రహెన్సివ్​రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్) కింద అప్పగించిన రోడ్ల మెయింటెనెన్స్ గడువు ముగియడంతో ఏజెన్సీలు ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాయి. సిటీలోని 812 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న రోడ్ల ఐదేండ్ల మెయింటెనెన్స్​బాధ్యతలను 2020లో రూ.1,839 కోట్లకు ఐదు ఏజెన్సీలకు అప్పగించారు. గడువు ముగియడంతో కొనసాగింపు కోసం 4 నెలల కింద ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ ప్రతిపాదనలు పంపింది.

కొనసాగింపునకు ప్రభుత్వం ఆసక్తి చూపించకపోవడంతో రోడ్లను బల్దియానే మెయింటెయిన్​చేస్తోంది. సీఆర్ఎంపీ కింద అప్పగిస్తే ఐదేండ్లకు దాదాపు రూ.2 వేల కోట్ల వరకు కావాలి. అలాగే సదరు ఏజెన్సీలు ఆశించిన స్థాయిలో మెయింటెయిన్​చేయడం లేదని ప్రభుత్వానికి సమాచారం ఉంది. పైగా జీహెచ్ఎంసీలో మెయింటెనెన్స్ కోసం ప్రత్యేకంగా ఇంజినీర్లు కూడా ఉండడంతో వారికే బాధ్యతలు అప్పగిస్తే సుమారు రూ.2 వేల కోట్లు మిగులుతాయని అనుకుంటోంది.  

ఏజెన్సీలు పట్టించుకోలే..

రోడ్ల నిర్మాణం, రిపేర్లను కాంట్రాక్టర్లకు అప్పగిస్తే నాణ్యతా లోపం ఉంటోందని, సీఆర్‌‌ఎంపీ పేరిట బల్దియా గతంలో ఏజెన్సీలకు అప్పగించింది. కొంతకాలం రోడ్లు బాగానే మెయింటెయిన్​చేసినా తర్వాత పట్టించుకోలేదు. సీఆర్ఎంపీ రోడ్లు ఉన్న ప్రతిరోడ్డుపై సీఆర్ఎంపీ రోడ్డు అని బోర్డు పెట్టి ఫోన్ నెంబర్ ఇచ్చేవారు.

ఆ రోడ్డులో ఏదైనా సమస్య ఉంటే కాల్ చేస్తే పరిష్కారం లభిస్తుందనేవారు. అయితే కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడం, ఎత్తినా సరైన సమాధానం ఇవ్వకపోవడం జరిగింది. పైగా రోడ్ల పక్కన ఫుట్ పాత్ లను అస్సలే  పట్టించుకోలేదు. 812 కిలోమీటర్ల మేర రోడ్లను అప్పగించినా 50 కి.మీ ఫుట్ పాత్ లను కూడా మెయింటెయిన్​చేయలేదు. రోడ్లకి రెండువైపులా సెంట్రల్ మీడియన్ ప్లాంటేషన్ బాధ్యత ఏజెన్సీలదే అయినా కొన్నిచోట్ల మాత్రమే చేశారు. 

ఏజెన్సీలపై విచారణ  కూడా..

ఏజెన్సీలకు రోడ్ల మెయింటనెన్స్​బాధ్యతలు అప్పగిస్తే పనులు చేయకుండా కోట్లాది రూపాయలు తీసుకున్నారన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సీఆర్ఎంపీలో జరిగిన పనులు, ఏజెన్సీలకు చేసిన చెల్లింపులపై విచారణ జరుపుతోంది. గ్రేటర్ పరిధిలోని ఆరు జోన్లలో ఐదు ఏజెన్సీలకు పనులు అప్పగించగా, చాలా ప్రాంతాల్లో అగ్రిమెంట్ ప్రకారం పనులు చేయలేదని తెలుస్తోంది.

 దీంతోనే ప్రభుత్వం సెకండ్ ఫేజ్ కు అనుమతులు ఇవ్వలేదు. అంతేగాకుండా ఏజెన్సీల పనితీరుపై ఒక్కో జోన్ కు ఒక్కో అడిషనల్ కమిషనర్ ని స్పెషల్ ఆఫీసర్ గా నియమించి నివేదిక అడగ్గా పనితీరు బాగోలేదని రిపోర్ట్ ఇచ్చినట్టు సమాచారం.