
- బోసిపోయిన రోడ్లు, ఫ్లై ఓవర్లు
- నేడు, రేపు రంజాన్ సెలవుతో ఊర్లకు పయనమైన జనం
- సందడి లేని ట్యాంక్ బండ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎప్పుడూ కార్లు, బైకులు, బస్సులతో రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్లు, ఫ్లై ఓవర్లు ఆదివారం ఖాళీగా దర్శనమిచ్చాయి. ఆదివారం ఉగాది రావడం, ఎండ మండిపోవడం, ఐపీఎల్లో హైదరాబాద్ మ్యాచ్ ఉండడంతో రోడ్లపై జనాలు కనిపించలేదు. సోమవారం రంజాన్ కావడం, మంగళవారం కూడా స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించడంతో చాలామంది సొంతూళ్ల బాట పట్టారు.
శనివారం, ఆదివారం ఐటీ ఉద్యోగులకు సెలవులు కలిసివచ్చాయి. ఎండలు దంచి కొట్టడంతో రోడ్డెక్కలేదు. సండే వచ్చిందంటే సందడిగా కనిపించే ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ గార్డెన్, నెక్లెస్ రోడ్ బోసిపోయి కనిపంచాయి. సికింద్రాబాద్, బేగంపేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, మాసబ్ ట్యాంక్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లోనూ రోడ్లు ఖాళీగా కనిపించాయి.