- డ్రైనేజీ నాలాలో పడి చనిపోతున్న చిన్నారులు
- ప్రతి ఏటా ఘటనలు జరుగుతున్నా
- పట్టించుకోని బల్దియా, వాటర్ బోర్డు
హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ పరిధి కలాసిగూడలో జీహెచ్ఎంసీ, వాటర్బోర్డ్ అధికారుల నిర్లక్ష్యం చిన్నారి ప్రాణం తీసింది. కలాసిగూడలో డ్రైనేజీ కనెక్షన్ కోసం అధికారులు రోడ్డును తవ్వి పైప్ వేశారు. ఆ పైప్‌లైన్‌ను రోడ్డు కింద ఉన్న నాలాకు లింక్ చేశారు. తర్వాత గుంతను పూడ్చకుండా అలాగే వదిలేశారు. శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి పైప్ పక్కన గుంత పెద్దది కావడంతో పాటు నీళ్లు నిండి ఉండటంతో 11 ఏండ్ల బాలిక మౌనిక అందులో పడిపోయింది. నాలాలో కొంతదూరం కొట్టుకెళ్లి చనిపోయింది. ఎన్వోసీలు తీసుకోకుండానే వాటర్‌బోర్డు అధికారులు పైప్‌లైన్ పనులు, డ్రైనేజీ, కేబుల్స్పనులంటూ రోడ్లు తవ్వి.. ఆ తర్వాత తిరిగి వేయడం లేదు. కొన్నిచోట్ల కేవలం మట్టి పోస్తుండగా, మరికొన్ని ఏరియాల్లో అలాగే వదిలేస్తుండటంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని జనం ఆరోపిస్తున్నారు.
రూల్స్‌కు విరుద్ధంగా..
గ్రేటర్ పరిధిలో రోడ్లను తవ్వాలంటే బల్దియా నుంచి ఎన్వోసీ(నాన్అబ్జక్షన్ సర్టిఫికెట్) తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా వర్షాలు పడే అవకాశం ఉందన్న సమయంలో రోడ్లను తవ్వకూడదు. కానీ ఈ రూల్స్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎన్వోసీలు తీసుకోకుండానే అడ్డగోలుగా రోడ్లు తవ్వుతున్నారు. కొన్ని చోట్ల రాత్రికి రాత్రే రోడ్లను తవ్వి పనులు చేసుకొని అలాగే వదిలేస్తున్నారు. ఎన్వోసీల విషయంపై బల్దియా అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
జీహెచ్ఎంసీ, వాటర్బోర్డ్ అధికారులు, పోలీసులు కలిసి నిర్వహించాల్సిన కన్వర్జెన్సీ సమావేశాలు కూడా జరగట్లేదు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరికలు జారీ చేసినా బల్దియా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ‘2020 సెప్టెంబర్‌లో నేరేడ్మెట్ పరిధిలోని నాలాలో పడి మా పాప సుమేధ చనిపోయి మూడేండ్లయినా బల్దియా పనితీరులో మార్పు లేదు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పిన జీహెచ్ఎంసీ ఏం చేస్తోందో అర్థం కావట్లే. ఈ విషయాలను మేయర్, కమిషనర్ ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇలాంటి ఘటనలకు భాధ్యత ఎవరు వహిస్తారు. ప్రభుత్వానికి జనాల ప్రాణాలంటే లెక్కలేకుండా పోతోంది’ అని సుమేధ తల్లి సుకన్య ఆవేదన వ్యక్తం చేసింది.
9 ఏండ్లలో ఏం చేశారు?
ప్రతి విషయంలో గత ప్రభుత్వాలపైనే బీఆర్ఎస్ సర్కారు ఆరోపణలు చేస్తోంది. అయితే 9 ఏండ్లలో ఈ ప్రభుత్వం ఏం చేసింది. బల్దియా కమిషనర్ బయటకు రావడం లేదు. పాలన అంతా ట్విట్టర్లోనే సాగుతోంది. బల్దియా కౌన్సిల్ సమావేశంలో చర్చ జరగడం లేదు. వాటర్ బోర్డు ఎండీ మీటింగ్‌కి కూడా రావడం లేదు. చిన్నారి మృతికి జీహెచ్ఎంసీనే కారణం.
– రాజశేఖర్ రెడ్డి, లింగోజిగూడ కార్పొరేటర్
2 నెలలుగా లేఖలు రాస్తున్న
వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీని గురించి 2 నెలలుగా మేయర్, కమిషనర్‌కు లేఖలు రాస్తున్నా స్పందించడం లేదు. నాలా సేఫ్టీ విషయంలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్న మంత్రి కేటీఆర్ మాటలు ఏమైనయ్. చిన్న వర్షం పడితే నగరం అతలాకుతలం అవుతోంది. ‘జనం చనిపోతే నేను ఏం చేస్తా’ అని ఎస్ఎన్డీపీ చీఫ్ జియావుద్దీన్ సమాధానం ఇవ్వడం దారుణం. కలాసిగూడలో బారికేడ్లు ఏర్పాటు చేసుంటే చిన్నారి చనిపోయేది కాదు. కింది స్థాయి అధికారులను సస్పెండ్ చేసి మేయర్, కమిషనర్ చేతులు దులుపుకుంటే సరిపోదు. ఇంజనీర్ చీఫ్‌ను సస్పెండ్ చేయాలె. నగరంలో ఇంత జరుగుతుంటే మంత్రి కేటీఆర్ ఏం చేస్తున్నారు?
– శ్రవణ్, మల్కాజిగిరి కార్పొరేటర్