హైదరాబాద్ రోడ్లు ఖాళీ... సిటీ నుంచి 3 లక్షల మంది సొంతూళ్లకు

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్  నుంచి వివిధ ప్రాంతాల ప్రజలు సొంతూళ్లకు వెళ్లిపోవడంతో నగరంలోని రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. నిత్యం ట్రాఫిక్​ రద్దీతో ఉండే రోడ్లన్నీ ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారిపోయాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా గత రెండు రోజులుగా భారీ సంఖ్యలో ప్రజలు తమ సొంతూళ్లకు వెళుతున్నారు. పండుగను పురస్కరించుకుని ఆర్టీసీ, రైల్వే ప్రత్యేక బస్సులు, రైళ్లను ఏర్పాటు చేశాయి.

ముఖ్యంగా రైల్వే శాఖ 366 ప్రత్యేక రైళ్లను సంక్రాంతి కోసం నడుపుతున్నది. ఆర్టీసీ అధికారులు 6,385 బస్సులను నడుపుతున్నారు. వీటితో పాటు ప్రైవేట్​ ట్రావెల్స్​ కు చెందిన బస్సులు కూడా వెయ్యి వరకూ నడుస్తున్నాయి. నగరంలోని మియాపూర్, శేరిలింగంపల్లి, కూకట్​పల్లి, కుత్బుల్లాపూర్, కేపీహెచ్​బీ, హైటెక్ సిటీ, మాదాపూర్, ఐటీ కారిడార్, ఎల్బీ నగర్, మణికొండ, పంజాగుట్ట, బంజారా హిల్స్, బేగంపేట  తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

గత రెండు రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో దాదాపు లక్ష మంది సొంతూళ్లకు వెళ్లారని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. ప్రైవేట్ ​ బస్సుల్లో మరో 50 వేల మంది, ప్రత్యేక రైళ్లలో మరో లక్షన్నర మంది వరకూ సొంతూళ్లకు వెళ్లారని అధికారులు తెలిపారు. నిత్యం బిజీగా కనిపించే హైటెక్​సిటీ, ఐటీ కారిడార్, ఐకియా వంటి ప్రాంతాల్లో రోడ్లన్నీ బోసిపోయాయి. ఈసారి రెండో శనివారం, ఆదివారంతో  పాటు పండుగ కూడా కలిసి రావడంతో చాలా మంది శుక్రవారం నుంచే సొంతూళ్ల బాటపట్టారు.