- నిందితుల నుంచి ఆటో, 3 సెల్ ఫోన్లు, కత్తి స్వాధీనం
- యూపీకి చెందిన వ్యక్తిని కొట్టి, డబ్బులు తీసుకున్న కేసులో అరెస్టు
పంజాగుట్ట, వెలుగు : ఆటో ఎక్కిన వారిని కత్తులతో బెదిరించి దోచుకుంటున్న ముగ్గురు సభ్యుల ముఠాను హైదరాబాద్ సనత్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఒక ఆటో, 3 సెల్ ఫోన్లు, కత్తి స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ డివిజన్ ఏసీపీ హనుమంతరావు సనత్‌నగర్ పీఎస్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. లాల్‌దర్వాజకు చెందిన ఠాగూర్ సురేందర్సింగ్(22) ఆటో డ్రైవర్, అత్తాపూర్‌కు చెందిన బిరదర్ సంతోష్(22) ఆటో నడుపుతాడు. మక్తల్‌కు చెందిన షేక్ హుజైర్ బాబా (23) అఫ్జల్ గంజ్‌లో ప్రైవేటు బస్సు డ్రైవర్ గా పని చేస్తూ బస్సులోనే ఉంటాడు.
వీరు ముగ్గురూ ఈజీగా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేసుకున్నారు. అర్ధరాత్రి వేళ ఆటో ఎక్కిన ప్రయాణికులను చీకటి ప్రాంతానికి తీసుకువెళ్లి బాధితులను కొట్టి డబ్బు, వస్తువులు, సెల్ ఫోన్లు లాక్కుని కత్తితో చంపేస్తామని బెదిరించే వారు. యూపీలోని ఇటావా జిల్లాకు చెందిన అభిషేక్ కుమార్(25) ప్రయివేట్ ఉద్యోగి. ఇతడు ఈనెల 16న కర్నూలు నుంచి హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ బస్టాండ్ కు రాత్రి 1 గంటకు చేరుకున్నాడు. ఇంటికి వెళ్లేందుకు వాహనం కోసం ఎదురు చూస్తున్నాడు. అతని వద్దకు ఆటో వచ్చి ఆగింది. ఆటోలో డ్రైవర్‌తోపాటు మరో ఇద్దరు వ్యక్తులున్నారు.
ఆటో భరత్‌నగర్ వంతెన వద్దకు వెళ్లిన వచ్చిన తర్వాత డ్రైవర్ గుట్కా కావాలంటూ ఆటోను యూటర్న్ తీసుకున్నాడు. సనత్‌నగర్ రైల్వేస్టేషన్ వద్దనున్న గ్రౌండ్ కు తీసుకువెళ్లి కత్తితో బెదిరించి, కొట్టి అతని వద్ద నున్న 12,700 నగదు, సెల్‌ఫోన్ లాక్కున్నారు. ఫోన్‌పే పాస్ వర్డ్ తీసుకుని అందులోని నగదు తీసుకోవడమే కాకుండా ఇతరుల ఫోన్‌లో డబ్బు వేయించాలని ఫోర్స్ చేయడంతో అతని మిత్రుడు రోహిత్ పాల్‌తో కొంత డబ్బు వేయించాడు.
బాధితుడు సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్ట్ చేశారు. మీడియా సమావేశంలో సనత్‌నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, డీఐ నాగిరెడ్డి, డీఎస్ఐ అరుణ్ కుమార్పాల్గొన్నారు.