హైదరాబాద్‌ స్కూళ్లను ఢిల్లీ లెక్క మారుస్తం

హైదరాబాద్‌ స్కూళ్లను ఢిల్లీ లెక్క మారుస్తం

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యార్థుల సంఖ్య తగ్గడం, రెసిడెన్షియల్‌‌ స్కూళ్లు పెరగడంతో ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌ అప్లికేషన్లు తగ్గాయని, అందువల్లే బడ్జెట్‌‌లో కేటాయింపులు తగ్గించామని ఆర్థిక మంత్రి హరీశ్​రావు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క స్టూడెంట్​కు రీయింబర్స్‌‌మెంట్ ఇస్తామని తెలిపారు. ఢిల్లీలోని స్కూళ్ల మోడల్‌‌ను హైదరాబాద్‌‌లోని బడుల్లో అమలు చేస్తామని చెప్పారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల నిధుల నుంచి కొంత స్కూళ్లకు ఇచ్చేందుకు సీఎం యోచిస్తున్నారని, దీనిపై త్వరలోనే గైడ్​లైన్స్​ సిద్ధం చేస్తామని వివరించారు. ఉద్యోగుల పీఆర్సీపై అతి త్వరలో సీఎం నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. శుక్రవారం కౌన్సిల్‌‌లో బడ్జెట్‌‌పై చర్చ సందర్భంగా హరీశ్​రావు మాట్లాడారు. బడ్జెట్ ప్రజలకు ఆశాజనకంగా ఉంటే, ప్రతిపక్షాలకు మాత్రం నిరాశాజనకంగా ఉందని కామెంట్​చేశారు.

పరిమితిలోనే అప్పులు

రాష్ట్ర అప్పులను జీఎస్డీపీని దృష్టిలో పెట్టుకొని చూడాలని హరీశ్​ రావు చెప్పారు. దేశంలో 24 రాష్ట్రాలు ఎఫ్ఆర్‌‌బీఎం పరిధి దాటి అప్పులు తీసుకున్నాయని, కానీ తెలంగాణ మాత్రం ఎఫ్‌‌ఆర్‌‌బీఎం పరిధిలో అప్పులు చేసిందని వివరించారు. రాష్ట్ర ఆదాయం పెంచుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. విద్యా రంగానికి పలు శాఖల ద్వారా బడ్జెట్లో 12.4 శాతం నిధులు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వ్యవసాయ, వైద్య శాఖ నుంచి కూడా విద్యా శాఖకు నిధులు ఇస్తున్నామన్నారు. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు లక్షా 23 వేల కొత్త ఉద్యోగులను నియమించామన్నారు. కేంద్రం నుంచి కోతలే తప్ప వచ్చిన నిధులు లేవని.. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేంద్రం ఇవ్వాల్సిన రూ.450 కోట్లు ఇప్పటికీ అందలేదని చెప్పారు. 14వ ఆర్థిక సంఘం నుంచి కూడా రూ. 395 కోట్లు రావాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో మండల, జిల్లా పరిషత్​లకు కూడా గ్రామ పంచాయతీల తరహాలో నిధులు కేటాయిస్తామని చెప్పారు. దశల వారీగా పాత జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని, ఇప్పటికే నాలుగు కొత్త కాలేజీలు ఏర్పాటు చేశామని తెలిపారు.

పోలీసు నిర్బంధం కోసమే రాష్ట్రం సాధించుకున్నమా?: జీవన్‌‌ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ విధానాన్ని వీడాలని, పోలీసుల నిర్బంధం కోసమే తెలంగాణ సాధించుకున్నామా అని కాంగ్రెస్‌‌ ఎమ్మెల్సీ జీవన్‌‌ రెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగులంతా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారేనని, కానీ టీఆర్ఎస్​ సర్కారు వారిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. టీచర్లు, ఎంప్లాయీస్‌‌ తలపెట్టిన చలో అసెంబ్లీని అడ్డుకునే విధంగా పోలీసులు చేపట్టిన ముందస్తు అరెస్టులను ఖండిస్తున్నామన్నారు. మండలిలో హరీశ్​రావు ప్రసంగం తర్వాత జీవన్‌‌ రెడ్డి మాట్లాడారు. పీఆర్సీ ఆలస్యమైతే కనీసం ఐఆర్​ అయినా ఇవ్వాలని కోరారు. వక్ఫ్‌‌బోర్డుకు జ్యుడిషియల్‌‌ పవర్స్‌‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఫారెస్ట్‌‌ యాక్ట్‌‌ కింద భూమి హక్కు పత్రాలు పొందిన వారికి రైతు బంధు ఇవ్వాలని డిమాండ్‌‌ చేశారు. రుణమాఫీని నాలుగువిడతలుగా కాకుండా రెండు విడతల్లోనే చెల్లించాలని, కొత్త గ్రామ పంచాయతీలకు రేషన్‌‌ షాపులు మంజూరు చేయాలని కోరారు.

టీచర్ల అరెస్టుకు నిరసనగా నర్సిరెడ్డి వాకౌట్‌‌

టీచర్లు, ఎంప్లాయీస్‌‌ ను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ టీచర్‌‌ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి కౌన్సిల్‌‌ నుంచి వాకౌట్‌‌ చేశారు. సభలో ప్లకార్డు ప్రదర్శించి, నిరసన వ్యక్తం చేశారు. తర్వాత మీడియా పాయింట్‌‌ వద్ద మాట్లాడారు. స్కూళ్లలో ఉన్న వేల మంది టీచర్లను కూడా బలవంతంగా స్టేషన్లకు లాక్కెళ్లారని ఆరోపించారు. అరెస్టులు అక్రమం, విచారకరమని, తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. వివిధ శాఖలను నుంచి కలిపి విద్యకు మొత్తంగా బడ్జెట్లో 9.4 శాతమే కేటాయించారని, దానిని 20శాతానికి పెంచాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం వెంటనే పీఆర్సీపై ప్రకటన చేయాలని కోరారు. కాంట్రాక్ట్‌‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌‌ చేశారు.

For More News..

లోక్‌సభకు చేరిన రేవంత్ వ్యవహారం

మైక్రోసాఫ్ట్‌కు బిల్‌గేట్స్ రాజీనామా

కరెంట్ చార్జీలు పెరిగితే భరించాలే