మొన్న 277..ఈసారి 287.. ఐపీఎల్‌‌‌‌ హిస్టరీలో హైదరాబాద్‌‌‌‌ అత్యధిక స్కోరు

మొన్న 277..ఈసారి 287.. ఐపీఎల్‌‌‌‌ హిస్టరీలో హైదరాబాద్‌‌‌‌ అత్యధిక స్కోరు
  •     తన రికార్డును తానే బ్రేక్‌‌‌‌ చేసిన సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌
  •     హెడ్‌‌‌‌ మెరుపు సెంచరీ
  •     దంచికొట్టిన క్లాసెన్‌‌‌‌, సమద్‌‌‌‌
  •     25 రన్స్‌‌‌‌ తేడాతో బెంగళూరుపై విక్టరీ
  •     262/7 స్కోరు చేసిన ఆర్‌‌సీబీ

మార్చి 27, 2024.  ఏప్రిల్ 15, 2024 .. ఐపీఎల్‌‌ చరిత్రలో నిలిచే తేదీలివి.


 ఒకటి  మెగా లీగ్‌‌లో పదకొండు ఏండ్లుగా చెక్కుచెదరని అత్యధిక స్కోరు (263/5) రికార్డు బ్రేక్ అయిన తేదీ అయితే..  మరోటి ఆ రికార్డు కేవలం 19 రోజుల్లోనే బద్దలైన రోజు. ఈ రెండింటికీ కారణం సన్ రైజర్స్‌‌ హైదరాబాదే.  రికార్డులు బ్రేక్ చేయాలన్నా... కొత్త రికార్డులు సెట్‌‌ చేయాలన్నా తమకే సాధ్యమని సన్‌‌రైజర్స్‌‌ మరోసారి చాటి చెప్పింది. గత నెల ఉప్పల్‌‌లో పరుగుల ఉప్పెన సృష్టిస్తూ 277/3 స్కోరు చేసిన రైజర్స్‌‌ ఇప్పుడు మరో పది రన్స్‌‌ ఎక్కువ చేసి  287/3 స్కోరుతో సరికొత్త రికార్డు సృష్టించింది.  

మొన్న తమ అడ్డాలో ముంబైకి చుక్కలు చూపెట్టిన హైదరాబాద్  ఈసారి ఆర్‌‌‌‌సీబీని వాళ్ల సొంతగడ్డపై  ఓ రేంజ్‌‌లో ఆడుకుంది.. వరల్డ్ కప్‌‌ ఫైనల్ హీరో ట్రావిస్ హెడ్ 39 బాల్స్‌‌లోనే సెంచరీ కొట్టేస్తే.. హెన్రిచ్ క్లాసెన్‌‌ మరోసారి తన ఖలేజా చూపెట్టాడు. అభిషేక్, మార్‌‌‌‌క్రమ్‌‌, సమద్ కూడా ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. మేమేం తక్కువా అన్నట్టు ఆర్‌‌‌‌సీబీ కూడా దీటుగానే బదులిచ్చింది. దినేశ్ కార్తీక్, డుప్లెసిస్‌‌, విరాట్ కోహ్లీ ధనాధన్ షాట్లతో ఆ జట్టు 262 రన్స్‌‌ చేసింది. రెండు ఇన్నింగ్స్‌‌ల్లో కలిపి ఏకంగా 549 రన్స్‌‌ నమోదై.. 38 సిక్సర్లు, 43 ఫోర్లు వచ్చిన ఈ మ్యాచ్‌‌ను ఫ్యాన్స్‌‌ అస్సలు మర్చిపోలేరు.

బెంగళూరు: ఐపీఎల్‌‌‌‌లో సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ మళ్లీ పరుగుల సునామీ సృష్టించింది. తన రికార్డును తానే బ్రేక్‌‌‌‌ చేసి మెగా లీగ్‌‌‌‌లో అత్యధిక స్కోరు సాధించింది.   ట్రావిస్‌‌‌‌ హెడ్‌‌‌‌ (41 బాల్స్‌‌‌‌లో 9 ఫోర్లు, 8  సిక్సర్లతో 102), హెన్రిచ్‌‌‌‌ క్లాసెన్‌‌‌‌ (31 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 67), అబ్దుల్‌‌‌‌ సమద్‌‌‌‌ (10 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 3  సిక్సర్లతో 37 నాటౌట్‌‌‌‌) రన్‌‌‌‌రంగం చేయడంతో సోమవారం జరిగిన లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌ 25 రన్స్‌‌‌‌ తేడాతో  రాయల్‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌ బెంగళూరును ఓడించింది. టాస్‌‌‌‌ ఓడిన హైదరాబాద్‌‌‌‌ 20 ఓవర్లలో 287/4 స్కోరు చేసింది. తర్వాత బెంగళూరు 20 ఓవర్లలో 262/7 స్కోరుకే పరిమితమైంది. దినేశ్‌‌‌‌ కార్తీక్‌‌‌‌ (35 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 7  సిక్సర్లతో 83), డుప్లెసిస్‌‌‌‌ (28 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లు, 4  సిక్సర్లతో 62), కోహ్లీ (20 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లు, 2  సిక్సర్లతో 42) పోరాడినా ప్రయోజనం దక్కలేదు. హెడ్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. 

పరుగుల మోత..

బ్యాటింగ్‌‌‌‌ పిచ్‌‌‌‌పై హైదరాబాద్‌‌‌‌ బ్యాటర్లు పరుగుల మోత మోగించారు.  స్టార్టింగ్‌‌‌‌లో హెడ్‌‌‌‌, మధ్యలో క్లాసెన్‌‌‌‌, చివర్లో సమద్‌‌‌‌ ఆర్‌‌‌‌సీబీ బౌలింగ్‌‌‌‌ను ఉతికేశారు. తొలి ఓవర్‌‌‌‌లో అభిషేక్‌‌‌‌ శర్మ (34) బౌండ్రీతో మొదలైన రన్‌‌‌‌రంగాన్ని హెడ్‌‌‌‌ 8 ఓవర్ల పాటు కొనసాగించాడు. 2వ ఓవర్‌‌‌‌లో హెడ్‌‌‌‌ 4, 6,  అభిషేక్‌‌‌‌ 6తో పెరిగిన జోరుకు మూడో ఓవర్‌‌‌‌లో విల్‌‌‌‌ జాక్స్‌‌‌‌ 4 రన్సే ఇచ్చి కాస్త బ్రేక్‌‌‌‌లు వేయగా, 4వ ఓవర్‌‌‌‌లో అభిషేక్‌‌‌‌ ఫోర్‌‌‌‌తో 7 రన్సే వచ్చాయి. 5, 6వ ఓవర్లలో హెడ్‌‌‌‌ 6, 6, 4, 6, 6, 4తో 38 రన్స్‌‌‌‌ దంచాడు. ఈ క్రమంలో 20 బాల్స్‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేయడంతో పవర్‌‌‌‌ప్లేలో సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ 76/0 స్కోరుతో నిలిచింది. 

7వ  ఓవర్‌‌‌‌లోనూ హెడ్‌‌‌‌ వరుసగా 4, 6, 6తో 21 రన్స్‌‌‌‌ రాబట్టాడు. 8వ ఓవర్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌ బాల్‌‌‌‌కు అభిషేక్‌‌‌‌ సిక్స్‌‌‌‌తో హైదరాబాద్‌‌‌‌ స్కోరు 100 రన్స్‌‌‌‌కు చేరగా, తర్వాతి ఓవర్‌‌‌‌లో టాప్లీ.. అభిషేక్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేసి ఆర్‌‌‌‌సీబీకి తొలి బ్రేక్ అందించాడు. దీంతో తొలి వికెట్‌‌‌‌కు 108 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. ఆ వెంటనే హెడ్‌‌‌‌ 4, 4, 6 తో ఫస్ట్‌‌‌‌ టెన్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌ 128/1 స్కోరు చేసింది. కొత్తగా వచ్చిన క్లాసెన్‌‌‌‌ సిక్స్‌‌‌‌తో టచ్‌‌‌‌లోకి రాగా, 12వ ఓవర్‌‌‌‌లో హెడ్‌‌‌‌ 4, 4, 2, 4తో 39 బాల్స్‌‌‌‌లోనే సెంచరీ పూర్తి చేశాడు. 13వ ఓవర్‌‌‌‌లో క్లాసెన్‌‌‌‌ 6 కొట్టగా, మూడో బాల్‌‌‌‌కు హెడ్‌‌‌‌ ఔట్‌‌‌‌కావడంతో రెండో వికెట్‌‌‌‌కు 57 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. 

తర్వాతి రెండు ఓవర్లలో 4, 6, 6, 4, 4, 6తో రెచ్చిపోయిన క్లాసెన్‌‌‌‌ 23 బాల్స్‌‌‌‌లోనే హాఫ్‌‌‌‌ సెంచరీ అందుకున్నాడు. ఫలితంగా 15 ఓవర్లలో హైదరాబాద్‌‌‌‌ స్కోరు 205/2కు పెరిగింది. అదే జోరులో మరో రెండు సిక్స్‌‌‌‌లు బాదిన క్లాసెన్‌‌‌‌ 17వ ఓవర్‌‌‌‌లో వెనుదిరగడంతో మూడో వికెట్‌‌‌‌కు 66 రన్స్‌‌‌‌ భాగస్వామ్యం ముగిసింది. సింగిల్స్‌‌‌‌తో ముందుకెళ్లిన మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ (32 నాటౌట్‌‌‌‌) సిక్స్‌‌‌‌ బాదినా నో బాల్‌‌‌‌ ఔట్‌‌‌‌ నుంచి బయటపడ్డాడు. కానీ ఆఖర్లో అబ్దుల్‌‌‌‌ సమద్‌‌‌‌ 4, 4, 4, 6, 6, 4తో సునామీలా విరుచుకుపడ్డాడు. లాస్ట్‌‌‌‌ ఓవర్‌‌‌‌లో మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ 4, 6 సమద్‌‌‌‌ 6తో నాలుగో వికెట్‌‌‌‌కు19 బాల్స్‌‌‌‌లో 56 రన్స్‌‌‌‌ రావడంతో ఐపీఎల్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌ మరోసారి అత్యధిక స్కోరును నమోదు చేసింది. 

కార్తీక్‌‌‌‌, డుప్లెసిస్‌‌‌‌ మెరుపులు

భారీ టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌ను బెంగళూరు ఓపెనర్లు కోహ్లీ, డుప్లెసిస్‌‌‌‌ కూడా దీటుగానే మొదలుపెట్టారు. ఫస్ట్‌‌‌‌ ఓవర్‌‌‌‌లో చెరో ఫోర్‌‌‌‌తో ఖాతా తెరవగా, 2వ ఓవర్‌‌‌‌లో విరాట్‌‌‌‌ 4, 6, తర్వాతి ఓవర్‌‌‌‌లో డుప్లెసిస్‌‌‌‌ 4, 6, 6తో జోరు పెంచాడు. 4వ ఓవర్‌‌‌‌లో ఇద్దరు చెరో రెండు ఫోర్లతో 17 రన్స్‌‌‌‌ రాబట్టారు. ఆ వెంటనే కోహ్లీ 4, 4, 6తో పవర్‌‌‌‌ప్లేలో ఆర్‌‌‌‌సీబీ 79/0 స్కోరు చేసింది. కానీ 7వ ఓవర్‌‌‌‌లో మార్కండే (2/46).. విరాట్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేసి తొలి వికెట్‌‌‌‌కు 80 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ను బ్రేక్‌‌‌‌ చేశాడు. 8వ ఓవర్‌‌‌‌లో డుప్లెసిస్‌‌‌‌ 6, 4 కొట్టినా విల్‌‌‌‌ జాక్స్‌‌‌‌ (7) రనౌటయ్యాడు. రజత్‌‌‌‌ పటీదార్‌‌‌‌ (9) సిక్స్‌‌‌‌తో ఖాతా తెరిచినా, 9వ ఓవర్‌‌‌‌లో వెనుదిరిగాడు. 

10వ ఓవర్‌‌‌‌లో కమిన్స్‌‌‌‌ (3/43) డబుల్‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌ ఇచ్చాడు. 4, 6 కొట్టిన డుప్లెసిస్‌‌‌‌, సౌరవ్‌‌‌‌ చౌహాన్‌‌‌‌ (0)ను ఔట్‌‌‌‌ చేయడంతో బెంగళూరు 122/5తో ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో దినేశ్‌‌‌‌ కార్తీక్‌‌‌‌, మహిపాల్‌‌‌‌ లోమ్రోర్‌‌‌‌ (19) బ్యాట్లు ఝుళిపించారు. 13వ ఓవర్‌‌‌‌లో రెండు సిక్స్‌‌‌‌లు కొట్టిన కార్తీక్‌‌‌‌ 14వ ఓవర్‌‌‌‌లో మూడు ఫోర్లు, ఓ సిక్స్‌‌‌‌తో 21 రన్స్‌‌‌‌ రాబట్టాడు. మధ్యలో 6, 4 కొట్టిన మహిపాల్‌‌‌‌ను 15వ ఓవర్‌‌‌‌లో కమిన్స్‌‌‌‌ వెనక్కి పంపాడు. ఆరో వికెట్‌‌‌‌కు 59 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. ఇక 30 బాల్స్‌‌‌‌లో 101 రన్స్‌‌‌‌ కావాల్సి ఉండగా, కార్తీక్‌‌‌‌ ఫోర్లు,  సిక్సర్లతో రెచ్చిపోయాడు. కానీ ఏడో వికెట్‌‌‌‌కు63 రన్స్‌‌‌‌ జోడించి 19వ ఓవర్‌‌‌‌లో ఔట్‌‌‌‌కావడంతో బెంగళూరుకు ఆరో ఓటమి తప్పలేదు.

సన్‌‌‌‌‌‌‌‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్ హెడ్.

ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో ఫాస్టెస్ట్‌‌‌‌‌‌‌‌ సెంచరీ చేసిన నాలుగో బ్యాటర్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌ (39 బాల్స్‌‌‌‌‌‌‌‌). గేల్‌‌‌‌‌‌‌‌ (30), యూసుఫ్‌‌‌‌‌‌‌‌ పఠాన్‌‌‌‌‌‌‌‌ (37), మిల్లర్‌‌‌‌‌‌‌‌ (38) ముందున్నారు.

ఒక ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టీమ్‌‌‌‌‌‌‌‌ సన్‌‌‌‌‌‌‌‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌. 21 సిక్సర్లతో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీబీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేసింది. 

ఈ మ్యాచ్‌‌ మొత్తంలో నమోదైన రన్స్‌. లీగ్‌‌లో అత్యధికం. గతనెల ఉప్పల్‌‌లో సన్ రైజర్స్‌‌–ముంబై మ్యాచ్‌‌లో వచ్చిన 523 రన్స్‌‌ రికార్డు బ్రేక్ అయింది. 

ఈ మ్యాచ్‌‌లో  మొత్తం బౌండరీలు (43 ఫోర్లు, 38 సిక్సర్లు).  ఓ టీ20 మ్యాచ్‌‌లో అత్యధికం.

 సంక్షిప్త స్కోర్లు


హైదరాబాద్‌‌‌‌: 20 ఓవర్లలో 287/3 (హెడ్‌‌‌‌ 102, క్లాసెన్‌‌‌‌ 67, సమద్‌‌‌‌ 37 నాటౌట్‌‌‌‌, ఫెర్గూసన్‌‌‌‌ 2/52). 

బెంగళూరు: 20 ఓవర్లలో 262/7 (దినేశ్‌‌‌‌ కార్తీక్‌‌‌‌ 83, డుప్లెసిస్‌‌‌‌ 62, కోహ్లీ 42, కమిన్స్‌‌‌‌ 3/43).