వైరస్​తో పైలం .. తెలంగాణలో ఇంటింటా దగ్గు, సర్ది, జ్వరాలు

వైరస్​తో పైలం .. తెలంగాణలో ఇంటింటా దగ్గు, సర్ది, జ్వరాలు
  • వెదర్ మారడంతో 30 శాతం పెరిగిన శ్వాసకోశ వ్యాధులు 
  • క్లైమేట్ చేంజ్, కాలుష్య ప్రభావం కూడా కారణం  
  • ఇంకోవైపు చైనాలో  విజృంభిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్
  • ఈ వైరస్​కూ ప్రస్తుతం అనుకూల వాతావరణం  
  • అందుకే జాగ్రత్తలు  పాటించాలంటున్న డాక్టర్లు, ఆఫీసర్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఫ్లూ వైరస్ వ్యాప్తి పెరుగుతున్నది. దీంతో ప్రతి ఇంటిలో  సర్ది, దగ్గు, జ్వర బాధితులు ఎక్కువవుతున్నారు. ఒకవైపు వాతావరణ మార్పులు, ఇంకోవైపు కాలుష్య తీవ్రతతో అటు పట్టణ, ఇటు గ్రామీణ ప్రాంతాల్లోనూ శ్వాసకోశ వ్యాధుల బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. అదే సమయంలో చైనాలో విజృంభిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు కూడా ఫ్లూ, శ్వాసకోశ వ్యాధులకు సంబంధించినవే ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఏ లక్షణాలతో ఎక్కువ మంది హాస్పిటల్స్​కు వస్తున్నారు? గత వారం రోజులుగా ఓపీ తాకిడి ఎలా ఉందనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. 

ఐదారోజులుగా రాష్ట్రంలో చలి తీవ్రతతో పాటు పొల్యూషన్​లెవెల్స్ పెరగడం కారణంగా శ్వాస‌‌‌‌కోశ వ్యాధుల‌‌‌‌తో బాధ‌‌‌‌ప‌‌‌‌డే రోగుల సంఖ్య ఏకంగా 30 శాతం పెరిగింద‌‌‌‌ని డాక్టర్లు చెబుతున్నారు. సాధారణ ఫ్లూ మాదిరిగా ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కానీ ఎక్కువ ఇబ్బంది పెట్టే శ్వాసకోశ సమస్యలు వస్తే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కొవిడ్ నిబంధనల్లో కొన్నింటిని కొంత కాలం పాటించాలని చెబుతున్నారు. అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్​లో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరంతో వచ్చే బాధితులకు ఇబ్బందులు లేకుండా మెడిసిన్ అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్య శాఖ ఆదేశించింది.  

కొవిడ్ తర్వాత పెరిగిన రెస్పిరేటరీ సమస్యలు

ఇన్‌‌‌‌ఫ్లూయెంజా వైరస్ వల్ల ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో సమస్యలు వస్తాయి. రాష్ట్రంలో ఇన్‌‌‌‌ఫ్లూయెంజా ఏ(హెచ్‌‌‌‌1ఎన్‌‌‌‌1) ఏటా సీజనల్‌‌‌‌ ఫ్లూలాగా వస్తుంటుందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పుడు రాష్ట్రంలో ఇన్‌‌‌‌ఫ్లూయెంజా ఏ, బీ వైరస్‌‌‌‌ ఎక్కువగా విస్తరిస్తున్నట్లు గుర్తించారు. దీనిపై జనాలెవరూ కంగారుపడాల్సిన అవసరంలేదని అంటున్నారు. ప్రస్తుతం ప్రజల్లో వస్తున్న ఫ్లూ వైరస్‌‌‌‌ మధ్యతరహా లక్షణాలతో అనారోగ్యానికి గురిచేస్తోందని, ఇవి హాస్పిటల్​లో చేరేంత తీవ్రంగా లేవని చెప్తున్నారు. కొవిడ్ తర్వాత సాధారణంగానే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు పెరిగాయి. 

Also Read :- జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాల భర్తీ

అందుకే  ఫ్లూ లక్షణాలతో వచ్చే వాళ్లకు ఇన్‌‌‌‌ఫ్లూయెంజా ఏ(హెచ్‌‌‌‌1ఎన్‌‌‌‌1), ఇన్‌‌‌‌ఫ్లూయెంజా ఏ(హెచ్‌‌‌‌3ఎన్‌‌‌‌3), ఇన్‌‌‌‌ఫ్లూయెంజా బీ, రెస్పిరేటరీ సిన్‌‌‌‌కైషియల్‌‌‌‌ వైరస్‌‌‌‌(ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌వీ), పారా ఇన్‌‌‌‌ఫ్లూయెంజా, అడెనో వైరస్‌‌‌‌లాంటి వివిధ రకాల పరీక్షలు నిర్వహించాలని సర్కార్ దవాఖాన్లకు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇన్​ఫ్లూయెంజా వంటి వాటి కారణంగానే 75.4 శాతం పెద్దలు, పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇన్‌‌‌‌ఫ్లూయెంజా ఏ రకం వైరస్ వల్ల ఊపిరితిత్తులపై ప్రభావంతో పాటు చలిజ్వరం, ఒళ్లు నొప్పులు, అలసటలాంటి లక్షణాలు ఉంటాయని, ఇది వర్షాకాలం, చలికాలంలో వ్యాపిస్తుంటుందని అంటున్నారు. అయితే, దీనితో దవాఖానలో చేరేంత తీవ్రత ఏమీ ఉండదని పేర్కొంటున్నారు. 

ఇష్టారీతిన యాంటీబయాటిక్స్ వద్దు

దగ్గు, జలుబు వంటి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విచక్షణారహితంగా యాంటీబయాటిక్స్‌‌‌‌ వాడొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. డాక్టర్ల సలహాల మేరకు మాత్రమే చికిత్స తీసుకోవాలంటున్నారు. సాధారణ ఫ్లూ ఇన్ఫెక్షన్‌‌‌‌ నాలుగైదు రోజుల్లో తగ్గిపోతుందని అంటున్నారు. చలికాలంలో మాస్క్ ధరించాని, తరచూ చేతులను శానిటైజర్, సబ్బుతో శుభ్రం చేసుకోవాలన్నారు. చల్లని పదార్థాలు తినొద్దని,  వేడిగా ఉన్న ఆహారాన్నే తీసుకోవాలని చెప్తున్నారు.