- దహన సంస్కారాలకు డబ్బుల్లేక, ఇంట్లో పెద్ద దిక్కు లేక ఎవరికీ చెప్పని బిడ్డలు
- మనోవేదనతో ఆత్మహత్య ఆలోచనలు
- చివరకు ఇంట్లో నుంచి బయటకు వచ్చి స్థానికులకు చెప్పడంతో వెలుగులోకి..
- సికింద్రాబాద్ వారాసిగూడలో ఘటన
పద్మారావునగర్, వెలుగు: అనారోగ్యంతో తల్లి చనిపోతే.. దహన సంస్కారాలకు డబ్బుల్లేక, ఇంట్లో పెద్ద దిక్కు లేక.. ఏం చేయాలో తెలియని స్థితిలో ఇద్దరు కూతుళ్లు డిప్రెషన్ లోకి వెళ్లారు. 9 రోజులుగా తల్లి శవాన్ని ఇంట్లోనే ఉంచుకున్నారు. ఈ ఘటన సికింద్రాబాద్‌లోని వారాసిగూడలో జరిగింది. వారాసిగూడ బౌద్ధనగర్‌లోని ఓ బిల్డింగ్ మూడో ఫ్లోర్లో సీమల శ్రీలలిత(45) కుటుంబం రెండేండ్లుగా అద్దెకు ఉంటున్నది. ఇద్దరు కూతుళ్లు రవళిక, అశ్వితతో కలిసి శ్రీలలిత జీవనం సాగిస్తున్నది. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగం చేసే ఆమె భర్త రాజు.. ఐదేండ్ల కింద కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడు. ఇంట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా రవళిక, అశ్విత.. టెన్త్ వరకే చదివి మానేశారు. రవళిక బట్టల షాపులో పని చేస్తుండగా, అశ్విత ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో క్యాటరింగ్ విభాగంలో పని చేస్తున్నది. వీళ్ల తల్లి శ్రీలలిత కొంతకాలంగా బ్రీతింగ్సమస్యతో బాధపడుతున్నది. ఈ క్రమంలో అనారోగ్యంతో జనవరి 22న రాత్రి ఆమె చనిపోయింది. కూతుళ్లు తెల్లారి లేచి చూసేసరికి తల్లి శవమై ఉంది. దీంతో బిడ్డలిద్దరూ షాక్ కు గురై డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురై సూసైడ్ చేసుకుందామని అనుకున్నారు.
ఎవరికి చెప్పాలో తెలియక..
దహన సంస్కారాలకు డబ్బుల్లేక, ఇంట్లో పెద్ద దిక్కు ఎవరూ లేకపోవడంతో.. తల్లి చనిపోయిన విషయాన్ని కూతుళ్లు ఎవరికీ చెప్పలేదు. తల్లి శవాన్ని ఇంట్లోనే ఉంచుకున్నారు. 9 రోజులుగా తల్లి శవాన్ని ఓ గదిలో ఉంచి, వాళ్లిద్దరూ మరో గదిలో ఉన్నారు. ఇంట్లో ఉన్న బ్రెడ్, ఇతర ఆహారం తింటూ కాలం గడిపారు. చివరకు శుక్రవారం ఇంట్లో నుంచి బయటకు వచ్చి, తల్లి చనిపోయిన విషయాన్ని స్థానికులకు చెప్పారు. తల్లి దహన సంస్కారాలకు ఆర్థిక సాయం కోసం ప్రయత్నించారు. సీతాఫల్ మండిలోని సికింద్రాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు వెళ్తే సాయం చేస్తారని స్థానికులు చెప్పడంతో.. అక్కడికి వెళ్లి తమ బాధను చెప్పుకున్నారు. స్పందించిన క్యాంప్ ఆఫీస్ సిబ్బంది వారాసిగూడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిలకలగూడ ఏసీపీ జైపాల్‌రెడ్డి, సీఐ సైదులు, అడ్మిన్ఎస్ఐ సుధాకర్ ఘటనా స్థలానికి చేరుకొని.. శ్రీలలిత డెడ్‌బాడీని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. క్లూస్ టీమ్‌తో ఇంట్లో పరిశీలించారు. వీళ్లు బిల్డింగ్ మూడో ఫ్లోర్లో ఉండడంతో.. శవం దుర్వాసన కింది వరకు రాకపోయి ఉండవచ్చని భావిస్తున్నారు.