- రైడ్ బుక్ చేస్తే గమ్య స్థానాలకు చేర్చేది మహిళా రైడర్లే
- కిలోమీటరుకు రూ.9 చార్జ్ వసూలు
- ముందుగా జేబీఎస్, సికింద్రాబాద్ స్టేషన్ల పరిధిలో అందుబాటులోకి..
- ఈవీ జిప్ యాప్‌తో ఒప్పందం చేసుకున్న మెట్రో అధికారులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: మెట్రోలో ప్రయాణించే మహిళలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు హైదరాబాద్ మెట్రో వినూత్న సర్వీసులను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిటీలో భాగంగా ఇండ్ల నుంచి మెట్రో స్టేషన్లకు, మెట్రో స్టేషన్ల నుంచి ఆఫీసులకు తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా మహిళలు నడిపే బైక్ట్యాక్సీలను అందుబాటులోకి తేనున్నది. ఇందుకోసం ఈవీ జిప్ అనే సంస్థతో శుక్రవారం బేగంపేటలోని హోటల్ వివంటాలో ఒప్పందం చేసుకుంది.
మహిళలే రైడర్లుగా కావాలనుకునే మహిళలు ఇండ్ల నుంచి మెట్రో స్టేషన్లకు, మెట్రోస్టేషన్ల నుంచి ఇండ్లకు వెళ్లాలనుకుంటే ఈ యాప్‌లో బైక్ టాక్సీ బుక్ చేసుకుంటే చాలు. చార్జి కేవలం కిలో మీటర్ కు రూ.9 మాత్రమే తీసుకుంటారు. దీని తర్వాత మహిళా రైడర్లతోనే కార్ టాక్సీలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఈవీ జిప్ నిర్వాహకులు చెప్పారు.
ముందు జేబీఎస్, ఈస్ట్ సికింద్రాబాద్ పరిధిలో..
ముందుగా మహిళా బైక్సేవలను జేబీఎస్, సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్లలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం 50 ఎలక్ట్రిక్టూవీలర్స్అందుబాటులో ఉండగా ట్రైనింగ్పూర్తి చేసుకున్న 20 మంది ఉండడంతో 20 బైకులను మాత్రమే తిప్పనున్నారు. కొద్ది రోజుల తర్వాత ఐటీ ఏరియాతో పాటు ఇతర ప్రాంతాల్లోని మెట్రో స్టేషన్లలో కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. మెట్రోలో సగటున 5 లక్షల మంది ప్రయాణిస్తుండగా వీరిలో 1.25 లక్షల మంది ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ సర్వీసులను ఉపయోగించుకుంటున్నారు. వీరిలో మహిళల శాతం కూడా ఎక్కువగానే ఉండడంతో వారి భద్రత కోసం ఈ బైక్ సేవలను తీసుకువచ్చారు. అలాగే ఎలక్ట్రిక్బైకుల వల్ల పొల్యూషన్ తగ్గడంతో పాటు మహిళా బైక్ రైడర్లు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడుతుందంటున్నారు.
సయోధ్య ఎన్జీఓ సహకారంతో..
సిటీలోని వివిధ ప్రాంతాలకు చెందిన 68 మంది మహిళలకు సయోధ్య ఎన్జీవో నిర్వాహకురాలు మృదుల ఆధ్వర్యంలో అంబర్ పేట్ గ్రౌండ్ డ్రైవింగ్ లో బైక్నడపడంపై శిక్షణ ఇచ్చారు. 30 రోజులుగా రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో డ్రైవింగ్ నేర్పించారు. నేర్చుకున్న మహిళల్లో గృహిణులు, చిన్నా, చితకా పనులు చేసుకునే వారున్నారు. వీరికి రోడ్ సేఫ్టీపై కూడా శిక్షణ ఇచ్చాక రెండు రోజుల్లో రైడ్లను ప్రారంభించనున్నారు. ఈవీజిప్యాప్ వీరికి టూవీలర్స్ అందించనుంది. సాలరీ బేస్డ్ గా కానీ, లేదా పార్ట్నర్బేస్డ్ గా కాని డబ్బును చెల్లించనున్నట్లు యాప్ నిర్వాహకులు చెబుతున్నారు.
మెట్రోను 230 కి.మీ.పైగా విస్తరిస్తాం
హైదరాబాద్ ప్రపంచ సిటీలతో పోటీ పడాలన్న సీఎం రేవంత్ రెడ్డి సంకల్పానికి అనుగుణంగాహైదరాబాద్ లో మెట్రో రైల్ వ్యవస్థను నలుదిక్కులా విస్తరిస్తున్నట్టు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మెట్రోని దాదాపు 230 కిలోమీటర్లకు పైగా విస్తరించడానికి ప్లాన్సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ఎలక్ట్రిక్ టూవీలర్బైక్లను, క్యాబ్ లను ఎల్అండ్ టీ ఎండీ కేవీబీ రెడ్డితో కలిసి ఎన్వీఎస్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ ఓల్డ్‌సిటీలో ప్రభావిత 1,100 ఆస్తులకు 170 ఆస్తులకు రు.80 కోట్లు నష్టపరిహారం చెల్లించామన్నారు. మరో రూ.80 కోట్ల పరిహారం చెల్లించేలా ప్రభావిత ఆస్తుల ఓనర్షిప్ డాక్యుమెంట్ల పరిశీలన జరుగుతోందన్నారు. ఎల్ అండ్ టీ మెట్రో రైల్ సీనియర్ అధికారులు మురళీ వరదరాజన్, రిషి వర్మ, కియోలిస్ మెట్రో ఎండీ ఎస్.సి.మిశ్రా, ఈవీ జిప్ సంస్థ వ్యవస్థాపకులు శ్రీధర్ శివలెంక, సీతారాం చెరుకుపల్లి పాల్గొన్నారు.
గతంలో టైలరింగ్ చేసేదాన్ని..
ఇదివరకు నేను టైలరింగ్ చేసేదాన్ని. ఆ డబ్బులు కుటుంబ పోషణకు సరిపోవట్లేదు. వేరే ఏదైనా పని చేయాలనుకున్నా. అప్పుడే సయోధ్య ఫౌండేషన్ గురించి తెలుసుకొని చేరాను. నెల రోజులపాటు డ్రైవింగ్‌లో శిక్షణ తీసుకున్నా. రెండు రోజుల్లో బైక్ ట్యాక్సీ నడపబోతున్నా. ఈ పనితో ఆర్థికంగా నిలదొక్కుంటానన్న నమ్మకం ఉంది.
స్వర్ణలత, ఘట్కేసర్
మాకు ఉపాధి.. వాళ్లకు ధైర్యం
మొన్నటి దాకా ఇంట్లో ఖాళీగా ఉన్నా. ఏదైనా పని చేయాలని ఆలోచిస్తున్న క్రమంలో సయోధ్య ఎన్జీఓ గురించి తెలుసుకొని చేరా. మగవారి బైక్ ట్యాక్సీలపై వెళ్లడానికి ఇబ్బంది పడేవారికి ప్రత్యమ్నాయంగా మారబోతున్నాం. వారికి ప్రయాణంలో ధైర్యాన్ని ఇవ్వడంతోపాటు, సురక్షితంగా ఇండ్లకు చేర్చబోతున్నాం. – శైలజ, అంబర్ పేట