పూరీలు గొంతులో ఇరుక్కుని స్టూడెంట్ మృతి

పూరీలు గొంతులో ఇరుక్కుని స్టూడెంట్ మృతి
  • హైదరాబాద్ బేగంపేటలోని 
  • అక్షర వాగ్దేవి స్కూల్​లో ఘటన

సికింద్రాబాద్, వెలుగు: పూరీలు గొంతులో ఇరుక్కుని ఓ బాలుడు మృతి చెందాడు. సికింద్రాబాద్ పాత బోయిగూడకు చెందిన గౌతమ్ ​జైన్ స్థానికంగా వ్యాపారం చేస్తున్నాడు. ఆయనకు కొడుకు విరేన్ జైన్ (11) బేగంపేట పీఎస్​ పరిధిలోని అక్షర వాగ్దేవి ఇంటర్నేషనల్​ స్కూల్​లో ఆరో తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరిగానే  సోమవారం స్కూల్​కు వెళ్లిన బాలుడు మిగతా విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం లంచ్​చేస్తున్నాడు. తన బాక్సులో పూరీలు తెచ్చుకున్న విరేన్ ​జైన్​ఒకేసారి మూడింటిని రోల్​ చేసి తింటుండగా, అవి గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడక విలవిలలాడాడు.

ఇది గమనించిన తోటి విద్యార్థులు స్కూల్​ టీచర్లకు చెప్పగా, వెంటనే బాలుడిని మారేడుపల్లిలోని గీతా నర్సింగ్ హోమ్​కు తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ్నుంచి అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు బాలుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసిన బేగంపేట పోలీసులు బాలుడి డెడ్​బాడీని గాంధీ మార్చురీకి తరలించారు. పిల్లవాడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లి ఉంటే ప్రాణాపాయం నుంచి బయటపడేవాడని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.