హైదరాబాద్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్బరాజు పృథ్వీరాజ్(30) మృతి చెందారు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యుత్తు శాఖ రిటైర్ ఉద్యోగి అబ్బరాజు వెంకటరమణ కుటుంబం హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలోని అల్కాపురిలో స్థిరపడింది. అబ్బరాజు వెంకటరమణ రెండేళ్ల కిందటే అనారోగ్య కారణంగా మృతి చెందారు. వెంకటరమణ కుమారుడు పృథ్వీరాజ్ ఎనిమిదేళ్లుగా యూఎస్ లోని నార్త్ కరోలినాలో అడోప్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. 2022 సంవత్సరంలో ఏప్రిల్ 21న శ్రీప్రియతో వివాహం జరిగింది.
భార్యతో కలిసి బుధవారం కారులో వెళ్తూ... వర్షం కారణంగా ముందు వెళ్తున్న మరో కారును ఢీ కొట్టారు. కార్ ఎయిర్ బాగ్స్ తెరుచుకోవడంతో దంపతులిద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. అయితే భార్యను కారులోనే కూర్చోబెట్టి... బయటికి వచ్చిన పృథ్వీరాజ్ ప్రమాద ఘటనపై పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం చెరవేస్తుండగా.. వేగంగా వచ్చిన మరో కారు ఆయన్ని ఢీకొట్టింది. దాంతో ఘటనాస్థలిలోనే పృథ్వీరాజ్ మృతి చెందాడు.
పృథ్వీరాజ్ మరణించడంతో.. అతని తల్లి, చెల్లెలు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం అనంతరం పృథ్వీరాజ్ మృతదేహాన్ని ఆదివారం హైదరాబాద్ తీసుకురానున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.