
దేశంలో అంత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో హోలీ ఒకటి. ఈ పండగ వస్తోందంటే, లక్షలాది మంది తమ స్వస్థలాలకు వెళ్లిపోతుంటారు. ఈ సమయంలో రైలు టికెట్లు బుక్ అవ్వడం పీడకలే. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది.
హోలీ పండుగ రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే.. కాచిగూడ(Kacheguda)- రాజస్థాన్‌లోని మదార్(Madar) మధ్య స్పెషల్ ట్రైన్స్ నడపనుంది. షెడ్యూల్ ప్రకారం, రైలు నంబర్ 07701 (కాచిగూడ - మదార్) మార్చి 11, 16 తేదీలలో నడుస్తుంది. అలాగే, రైలు నంబర్ 07702 (మదార్ - కాచిగూడ) మార్చి 13, 18 తేదీలలో నడుస్తుంది.
ఈ ప్రత్యేక రైళ్లు మల్కాజ్‌గిరి, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర్, ధర్మాబాద్, నాందేడ్, పూర్ణ, బాస్మత్, వాషిం, అకోలా, బర్హన్‌పూర్, రాణి కమల్‌పతి, సెహోర్, ఉజ్జయిని, మాంద్‌సోర్, భిల్వారా, నసీరాబాద్, అజ్మీర్ రైల్వే స్టేషన్‌లలో రెండు వైపులా ఆగుతాయి. ప్రయాణికులు ఈ షెడ్యూల్‌ను గమనించి, తదనుగుణంగా తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కోరారు.
Holi special train services between Kacheguda - Madar @drmsecunderabad @drmned pic.twitter.com/KCLMVSsYMu
— South Central Railway (@SCRailwayIndia) March 1, 2025
హోలీ స్పెషల్ రైళ్లతో పాటు, వారాంతాల్లో అదనపు ప్రయాణీకుల రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే.. చర్లపల్లి - కాకినాడ టౌన్, చర్లపల్లి- నర్సాపూర్ మధ్య 20 ప్రత్యేక రైళ్లు నడుపుతుంది. ఈ సర్వీసులు మార్చి 2025లో ఎంపిక చేసిన తేదీలలో నడుస్తాయి.
చర్లపల్లి– కాకినాడ టౌన్ ప్రత్యేక రైళ్లు (రైలు నెం. 07031/07032) శుక్రవారం సాయంత్రం 7:20 గంటలకు చర్లపల్లి నుండి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 04:30 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కాకినాడ టౌన్ నుండి ఆదివారం సాయంత్రం 6:55 గంటలకు బయలుదేరి సోమవారం ఉదయం 06:50 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఈ రైళ్లు మార్చి 7, 13, 21, మరియు 28 తేదీల్లో నడుస్తాయి.
అదే విధంగా, చర్లపల్లి–నర్సాపూర్ ప్రత్యేక రైళ్లు (రైలు నెం. 07233/07234) శుక్రవారం రాత్రి 8:15 గంటలకు చర్లపల్లి నుండి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 05:50 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నర్సాపూర్ నుండి ఆదివారం రాత్రి 8:00 గంటలకు బయలుదేరి సోమవారం ఉదయం 06:00 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ సర్వీసులు మార్చి 7, 13, 21, మరియు 28 తేదీలలో కూడా నడుస్తాయి. ప్రయాణీకులు ఈ సౌకర్యాన్ని గమనించగలరు.