రెండు తెలుగురాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇక, తెలంగాణలో వీటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీధి వీధుల్లో గణపతి బప్ప మోరియా అంటూ నినాదాలు మారుమోగుతాయి. అయితే,నగరంలో ఖైరతాబాద్ వినాయకుడి మండపంతో పాటు అత్యంత ప్రసిద్ది చెందిన గణేషుని మండపాలు చాలానే ఉన్నాయి. హైదరాబాద్‌లోని ప్రసిద్ధిచెందిన గణేషుని మండపాల గురించి తెలుసుకుందాం
ఖైరతాబాద్: హైదరాబాద్‌లో ఖైరతాబాద్ వినాయకుడు ఎంతో ప్రసిద్ధి..ఇక్కడ ప్రత్యేకంగా నవరాత్రిళ్ల సమయంలో నిత్యం వేలాదిమంది భక్తులు లంబోదరుని దర్శనం కోసం వస్తారు. . హైదారాబాద్‌లో ప్రసిద్ధిచెందిన గణేషుని మండపాలలో ఖైరతాబాద్ వినాయకుని మండపం ఒకటి. ఇక్కడ 1954 నుండి గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది ఇక్కడి వినాయకుడిలో ఒక్కో ప్రత్యేకత.. ఒక్కో ఎత్తుతో భక్తులకు దర్శనమిస్తారు. ఖైరతాబాద్ గణపతి అంటే ఒక్కతెలుగు రాష్ట్రాలకే కాదు, విదేశీ పర్యాటకులకు సైతం ఆసక్తిగా ఉంటుంది. ఇక ఈ ఏడాది (2024) ఖైరతాబాద్ గణేశుడు 70 అడుగుల ఎత్తుతో.. సప్తముఖ గణపతి అవతారంలో కొలువుదీరాడు. ఈసారి ఇక్కడ అత్యంత రద్దీ నెలకొనుంది. పోలీసులు భద్రతా దృష్ట్యా ఇక్కడ భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు.
బాలాపూర్ : హైదరాబాద్‌లో మరో ప్రసిద్ధిచెందిన గణపతి మండపం బాలాపూర్. ఇక్కడికి ఓ ప్రత్యేక విశిష్టత ఉంది. ఇక్కడి లడ్డూ వేలం పాట ఎంతో ప్రత్యేకత. బాలాపూర్ గణేష్ అసోసియేషన్ 1980లో ప్రారంభమైంది. లడ్డూ వేలం పాటను మాత్రం 1994లో ప్రారంభమైంది. అప్పడు కేవలం 450 రూపాయలతో మొదలయ్యింది. ఈ లడ్డూను పొలంలో చల్లితే పంటలు బాగా పండుతాయని ప్రజల నమ్మకం. అందుకే ఎక్కువశాతం ఈ వేలంపాట స్థానికులకే దక్కుతుంది. ఇక్కడ వేలంపాట మొదలయినప్పటినుంచి పదిహేడేళ్లు స్థానికులకే అవకాశం కల్పించారు. అనంతరం స్థానికులేతరులు వేలంపాట దక్కించుకుంటున్నారు. ఈ వేలం పాటకు పోటీలు కూడా నిర్వహిస్తారు. వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమైనప్పటినుంచే వేలంపాటలు పోటీలు ఉంటాయి. వాటికి దరఖాస్తులు కూడా తీసుకుంటారు. ఈ వేలంపాట ధరఖాస్తులను నిమజ్జనం రోజు ఉదయం ఏడు గంటలకు ముగిస్తారు. లడ్డూను దక్కించుకున్న వారు ఒక అగ్రిమెంట్ పైన సంతకం కూడా చేయాల్సి ఉంటుంది.
గౌలిపుర: నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో, వినాయక చవితి ఉత్సవాలు ఎంతో సంప్రదాయంగా నిర్వహిస్తారు. ఇక్కడ వినాయకుని ఉత్సవాలను అత్యంత పురాతనమైన ప్రసిద్ధ మండపాల్లో జరుపుతారు. అందులో గౌలిపుర గణపతి ఒకటి. ఇక్కడి మండపంలోని వినాయకుడిని చూసేందుకు తెలుగు రాష్ట్రాల వారే కాకుండా తమిళనాడు, కర్నాటక మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల ప్రజలు కూడా వస్తారు. ఇక్కడ ప్రతి ఏటా వినాయకుని ఒక్కో రూపంలో ప్రతిష్టిస్తారు. వినాయకుని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయకునికి భారీ అలంకరణ, సెట్టి్ంగ్ లతో ఏర్పాటు చేస్తారు. ఆ తొమ్మిదిరోజులు విశేష పూజలు చేస్తారు. వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఇక్కడ ప్రతి ఏటా అన్నదానం వంటి కార్యక్రమాలు చేస్తారు. అంతేకాదు, భారీ బ్యాండ్ ప్రదర్శనలు కూడా ఉంటాయి. వీటితోపాటు వీధుల్లో చేసే నృత్యాలు ఇక్కడికి వచ్చేవారిని ఎంతగానో ఆకట్టుకుంటాయి.