ప్రాణం తీసిన రీల్స్ సరదా .. ఫొటో షూట్​కు వచ్చి ఇంటర్ విద్యార్థి మృతి

ప్రాణం తీసిన రీల్స్ సరదా .. ఫొటో షూట్​కు వచ్చి ఇంటర్ విద్యార్థి మృతి
  • హైదరాబాద్​ జవహర్ నగర్ పరిధి క్వారీ గుంత వద్ద ఘటన 

జవహర్ నగర్, వెలుగు: ఇన్​స్టాగ్రామ్ వీడియో ప్రాణం తీసింది.  హైదరాబాద్ జవహర్ నగర్ మల్కారం క్వారీ గుట్టల వీడియో చూసి, సరదాగా రీల్స్ తీసుకోవడానికి వచ్చిన ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. కుటుంబసభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. కౌకూర్ భరత్ నగర్​కు చెందిన దొపరివాడ రమేశ్, వాణి దంపతులకు ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్నారు.  చిన్న కొడుకు తరుణ్ (17) ఇటీవల ఇంటర్ పూర్తి చేశాడు. మూడు రోజుల్లో తన బర్త్​డే ఉండడంతో ఫొటో షూట్ కోసం ఆన్​లైన్​లో వెతికాడు. 

సమీపంలో జవహర్ నగర్ మల్కారంలో గుట్టల పక్కనే ఉన్న క్వారీ గుంత కనిపించడంతో ఐదుగురు స్నేహితులతో కలిసి సోమవారం సాయంత్రం అక్కడికి వెళ్లాడు. గుట్టలపై కొందరు మిత్రులు ఫొటోలు దిగుతుండగా, తరుణ్ మరో స్నేహితుడు కలిసి క్వారీ గుంతలోకి దిగడానికి ప్రయత్నించారు. తరుణ్​కు లోతు తెలియకపోవడంతో అందులో మునిగిపోయాడు.  బయటకు తీసేందుకుస్నేహితులు ప్రయత్నించినా  ఫలితం లేదు.  దీంతో జవహర్ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.  రాత్రి కావడంతో డెడ్ బాడీని వెలికితీయడం సాధ్య పడలేదు. మంగళవారం ఉదయం డీఆర్ఎఫ్ బృందాలు, జవహర్ నగర్ పోలీసులు సాయంతో డెడ్ బాడీని బయటకు తీశారు.