గ్రహాలు రివర్స్: వాస్తు పండితుడి ఇంట్లో దోపిడీ: కోట్లలో నగదు, అరకిలో బంగారం చోరీ

ఇల్లు కట్టాలంటే వాస్తు.. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో చెప్పేది వాస్తు.. ఇంట్లో వాళ్లకు కలిసి రాలేదంటూ వాస్తు పండితుడి దగ్గరకు పరిగెత్తుతాం. అలాంటిది వాస్తు పండితుడి ఇంట్లోనే దోపిడీ జరిగింది. హైదరాబాద్ సిటీ నడిబొడ్డున ఉన్న అమీర్ పేట మధురానగర్‌లో ఓ ప్రముఖ వాస్తు పండితుడి ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. పోయిన సొత్తు.. సొమ్ము తెలిసిన తర్వాత పోలీసులే నోరెళ్లబెడుతున్నారు. అక్షరాలా రూ. 3.93 కోట్ల నగదు, 450 గ్రాముల బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు.

మధురానగర్ పరిధిలోని సారథి స్టూడియో వెనుకన ఓ మూడంతస్తుల భవనంలోని పెంట్ హౌస్‏లో వాస్తుశాస్త్ర నిపుణుడు వీఎన్ఎన్. చౌదరి అద్దెకుంటున్నారు. గత 25 ఏళ్లుగా ఆయన అక్కడే ఉంటున్నారు. అయితే 6 నెలల కిత్రం ఆ ఇంటి యజమాని వీరిని ఇల్లు ఖాళీ చేయాలని కోరారు. దీంతో ఆయన సొంత ఇళ్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందుకోసం రూ. 3.93 కోట్ల నగదు, 450 గ్రాముల బంగారు కడ్డీలను ఇంట్లో పరుపు కింద మూడు సూట్ కేసుల్లో దాచి పెట్టారు. 

Also Read :- మరో ఐఏఎస్ అధికారిణికి వేధింపులు.. మేడం అభిమాని అంటూ ఇంటి వద్ద హంగామా

అనంతరం ఈ నెల 12న ఉదయం పని మీద బయటకు వెళ్లిన ఆయన రాత్రి 11 గంటలు దాటిన ఇంటికి తిరిగి వచ్చారు. బయట వైపు తలుపులు, గోడలు దెబ్బతిని ఉండటంతో పాటు ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో చోరీ జరిగినట్టుగా గుర్తించారు. కంగారుగా లోపలికి వెళ్లి చూడగా.. దాచిన సొమ్ము, బంగారం కనపడలేదు. వెంటనే రూ. 3.93 కోట్లు, 450 గ్రాముల బంగారు కడ్డీలు, 3 ల్యాప్‌ట్యాప్‌లు, విలువైన పత్రాలు చోరీకి గురైనట్టుగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఓ వాస్తు పండితుడి దగ్గర ఇన్ని కోట్ల రూపాయల డబ్బు దోపిడీ అవ్వడం నగరంలో హాట్ టాపిక్ గా మారింది.