ఏఐ, జీసీసీలకు హైదరాబాద్ గమ్యస్థానం

  • స్కిల్ ఉన్న యువత ఎంతో మంది ఉన్నరు: మంత్రి శ్రీధర్ బాబు
  • యూఎస్ ఐబీసీ, తెలంగాణ మధ్య కీలక ఒప్పందం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లో అత్యంత అధునాతనమైన మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని, స్కిల్ ఉన్న యువత ఎంతో మంది ఉన్నారని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఏఐ, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)కు హైదరాబాద్​ను గమ్యస్థానంగా మారిందని అన్నారు. తాజ్ కృష్ణ హోటల్​లో మంగళవారం యూఎస్, ఇండియా బిజినెస్​ కౌన్సిల్ (యూఎస్​ఐబీసీ), తెలంగాణ మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడారు. ‘‘జీసీసీల ఏర్పాటుకు ప్రపంచ స్థాయి వనరులను సృష్టించేందుకు తమ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఐటీ, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ రంగాలకు చెందిన దిగ్గజ సంస్థలు హైదరాబాద్​లో జీసీసీలు ఏర్పాటు చేశాయి.

భవిష్యత్తులో సిలికాన్​ సిటీనే హైదరాబాద్​కు రప్పించేందుకు కృషి చేస్తున్నాం. సిటీలో పరిశోధన, అభివృద్ధి రంగాలకు అనువైన వాతావరణం ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడంలో హైదరాబాద్ ను భాగస్వామిగా చేయాలి. ఏఐ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు 200 ఎకరాల్లో ఏఐ సిటీని నిర్మిస్తున్నాం’’అని శ్రీధర్ బాబు వివరించారు. ఏరో స్పేస్, డిఫెన్స్, ఎనర్జీ, బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్స్, పారిశ్రామిక ఉత్పత్తులకు సంబంధించి హైదరాబాద్ లో అత్యంత అనుకూల వాతావరణాన్ని నెలకొల్పామన్నారు. ఈ కార్యక్రమంలో యూఎస్ కాన్సూల్ జనరల్​ జెన్నిఫర్​ లారెన్స్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, యూఎస్ ఐబీసీ ఎండీ రాహుల్ శర్మ, సీనియర్ డైరెక్టర్ ఆదిత్య కౌషిక్​ తదితరులు పాల్గొన్నారు.