నల్గొండ రింగ్‌‌‌‌‌‌‌‌ రోడ్డుపై రాజకీయ దుమారం

  • మూడో ప్లాన్‌‌‌‌‌‌‌‌లో భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళన
  • బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ మాజీ ఎమ్మెల్యే సహకరిస్తున్నారని ఆరోపణలు
  • గతంలోనూ నేషనల్‌‌‌‌‌‌‌‌ హైవే పనులకు అడ్డంకులు
  • బాధితులకు నష్టం జరగకుండా చూస్తామంటున్న మంత్రి కోమటిరెడ్డి 
  • రూ.1000 కోట్లతో నిర్మాణానికి ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌

నల్గొండ, వెలుగు : నల్గొండ పట్టణంలో ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టిన రింగ్‌‌‌‌‌‌‌‌ రోడ్డు నిర్మాణం రాజకీయ రంగు పులుముకుంది. సెంట్రల్‌‌‌‌‌‌‌‌ ఫండ్స్‌‌‌‌‌‌‌‌ రూ.700 కోట్లు, స్టేట్‌‌‌‌‌‌‌‌ ఫండ్స్‌‌‌‌‌‌‌‌ రూ.300 కోట్లు కలిపి మొత్తం రూ.1000 కోట్లతో రింగ్‌‌‌‌‌‌‌‌ రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్టు రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంటకటరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు నేషనల్‌‌‌‌‌‌‌‌, స్టేట్‌‌‌‌‌‌‌‌ హైవే అథారిటీలు కలిసి మూడు రకాల ప్లాన్స్‌‌‌‌‌‌‌‌ రూపొందించాయి. వీటిల్లో మూడో ప్లాన్‌‌‌‌‌‌‌‌ను రద్దు చేయాలని బాధితులు కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్నారు. దీనికి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, బీజేపీ లీడర్లు సైతం తోడు కావడంతో రింగ్‌‌‌‌‌‌‌‌ రోడ్డు వ్యవహారం హాట్‌‌‌‌‌‌‌‌టాపిక్‌‌‌‌‌‌‌‌లా మారింది.

అయితే ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ ఇంకా టెండర్ల దశలోనే ఉందని, కేవలం భూసేకరణ కోసమే రూ.190 కోట్లు రిలీజ్‌‌‌‌‌‌‌‌ అయ్యాయని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు చెబుతున్నారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా బాధితులు మూడు వేల మంది కాదని, కేవలం మూడు, నాలుగు వందల కుటుంబాలే ఉన్నాయని, ఎక్కువగా భాగం కమర్షియల్‌‌‌‌‌‌‌‌ ప్లాట్లు, ఖాళీ జాగాలే ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం రింగ్‌‌‌‌‌‌‌‌ రోడ్డు ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌ తెరపైకి రావడంతో భూముల రేట్లు డబుల్‌‌‌‌‌‌‌‌ అవుతాయని, కానీ రోడ్డు నిర్మాణం జరిగితే తామంతా నష్టపోతామని బాధితులు వాపోతున్నారు. మంత్రి కోమటిరెడ్డి మాత్రం మార్కెట్‌‌‌‌‌‌‌‌ రేటు కంటే మూడు రెట్లు ఎక్కువ నష్టపరిహారం ఇ ప్పిస్తానని ఇప్పటికే హామీ ఇచ్చారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్లాన్‌‌‌‌‌‌‌‌ మార్చాల్సిందేనని పట్టుబడ్తుండడంపై కాంగ్రెస్ నేతల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

మొదటి ఫేజ్‌‌‌‌‌‌‌‌లో హైవే టు హైవే లింక్‌‌‌‌‌‌‌‌

నల్గొండ పట్టణం లోపలి నుంచి హైవేను విస్తరిస్తే ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని, ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ సమస్య పెరిగి రోడ్డు ప్రమాదాలు జరుగుతాయన్న ఆలోచనతో ఆఫీసర్లు ప్రత్యామ్నాయ ఆలోచన చేశారు. ఇందుకోసం మూడు ప్లాన్‌‌‌‌‌‌‌‌లు రూపొందించగా మొదటి ప్లాన్‌‌‌‌‌‌‌‌కు స్టేట్‌‌‌‌‌‌‌‌ హైవే ఆఫీసర్లు గ్రీన్‌‌‌‌‌‌‌‌ సిగ్నల్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. ఈ రోడ్డు నిర్మాణానికి రూ. 300 కోట్లు కేటాయించారు. ఈ ప్లాన్‌‌‌‌‌‌‌‌ ప్రకారం నకిరేకల్‌‌‌‌‌‌‌‌ నుంచి వచ్చే 565-- హైవే నల్గొండ టౌన్‌‌‌‌‌‌‌‌లోకి రాకుండా పానగల్లు, కేశరాజుపల్లి మీదుగా ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌బీసీ రోడ్డు (సాగర్‌‌‌‌‌‌‌‌ రోడ్డు వద్ద 565 హైవే)కు కలుపుతారు. ఈ ప్లాన్‌‌‌‌‌‌‌‌లో వ్యవసాయ భూములు, ప్రభుత్వ ల్యాండ్స్‌‌‌‌‌‌‌‌ మాత్రమే ఉన్నాయి. భూసేకరణ కోసం రూ.193 కోట్లు రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఈ ప్లాన్‌‌‌‌‌‌‌‌పైన ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు.

సెకండ్‌‌‌‌‌‌‌‌ ఫేజ్‌‌‌‌‌‌‌‌లో బైపాస్‌‌‌‌‌‌‌‌ నిర్మాణం

రింగ్‌‌‌‌‌‌‌‌ రోడ్డు నిర్మాణానికి కేంద్రం ఒప్పుకునే అవకాశం లేకపోవడంతో బైపాస్‌‌‌‌‌‌‌‌ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఈ రోడ్డు నిర్మాణానికి కేంద్రం రూ.700 కోట్లు కేటాయించింది. రెండో ప్లాన్‌‌‌‌‌‌‌‌ ప్రకారం అయితే బైపాస్‌‌‌‌‌‌‌‌ రోడ్డు పట్టణానికి 20 కిలోమీటర్ల దూరం నుంచి వేయాల్సి వస్తోంది. దీనివల్ల నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతుంది. పైగా పట్టణానికి దూరంగా బైపాస్‌‌‌‌‌‌‌‌ రోడ్డు నిర్మిస్తే వెహికల్స్‌‌‌‌‌‌‌‌ పట్టణంలో నుంచే రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రమాదాలు జరుగుతాయి. పట్టణంలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌ చేపట్టిన రోడ్డు వెడల్పు వల్ల ఇప్పటికే ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి.

వీటిని దృష్టిలో పెట్టుకొని సెకండ్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ను కేంద్రం రిజక్ట్‌‌‌‌‌‌‌‌ చేసింది.  దీనికి బదులుగా పట్టణానికి సమీపంలో నుంచి రోడ్డు నిర్మించే మూడో ప్రపోజల్‌‌‌‌‌‌‌‌కు కేంద్రం గ్రీన్‌‌‌‌‌‌‌‌ సిగ్నల్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. ఈ రోడ్డు మొత్తం పొడవు 15 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. పానగల్లు నుంచి మర్రిగూడ సర్కిల్‌‌‌‌‌‌‌‌, హౌజింగ్‌‌‌‌‌‌‌‌ బోర్డు, కతాల్‌‌‌‌‌‌‌‌గూడ మీదుగా ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌బీసీ రోడ్డు (565 హైవే)కు కలుపుతారు. ఈ బైపాస్​ పూర్తి అయితే దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ, నాగార్జునసాగర్​ వెళ్లే వెహికల్స్ నల్గొండ పట్టణంలోకి రాకుండా నేరుగా బైపాస్‌‌‌‌‌‌‌‌ మీది నుంచి వెళ్లిపోతాయి. ప్లాన్‌‌‌‌‌‌‌‌ 1, 3లో వేసే రోడ్లను కలిపితే నల్గొండ చుట్టూ రింగ్‌‌‌‌‌‌‌‌ రోడ్డు పూర్తయినట్లే. కానీ ఇప్పుడు ప్లాన్‌‌‌‌‌‌‌‌ 3 పైనే పొలిటికల్‌‌‌‌‌‌‌‌ గేమ్‌‌‌‌‌‌‌‌ నడుస్తోంది.

నాడు అట్ల.. నేడు ఇట్ల.. భూపాల్​రెడ్డి తీరుపై కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఫైర్‌‌‌‌‌‌‌‌

కంచర్ల భూపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి నల్గొండ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పట్టణంలో పానగల్లు జంక్షన్‌‌‌‌‌‌‌‌ నుంచి డీఈవో ఆఫీస్‌‌‌‌‌‌‌‌ వరకు నేషనల్‌‌‌‌‌‌‌‌ హైవే 565లో భాగంగా చేయాల్సిన రోడ్డు వెడల్పు పనులను అడ్డుకున్నారు. ఈ రోడ్డు కారణంగా కమర్షియల్‌‌‌‌‌‌‌‌ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌లు, అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్లు, ఇండ్లు తొలగించాల్సి వస్తదని నేషనల్‌‌‌‌‌‌‌‌ హైవే ఆఫీసర్లపై ఒత్తిడి తేవడంతో పనులు ఆగిపోయాయి. అదే సమయంలో కేసీఆర్‌‌‌‌‌‌‌‌ దత్తత తీసుకున్నారన్న సాకుతో మర్రిగూడ జంక్షన్‌‌‌‌‌‌‌‌ నుంచి మేకల అభినవ్‌‌‌‌‌‌‌‌ స్టేడియంవరకు రోడ్డు వెడల్పు చేసి, వందలాది ఇండ్లను, షాపులను నేలమట్టం చేశారు.

ఈ క్రమంలో బాధితుల గోడును ఏమాత్రం పట్టించుకోకపోగా పైసా పరిహారం ఇవ్వలేదన్న విమర్శలున్నాయి. పైగా నాసిరకమైన పనుల వల్ల పట్టణంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ పనుల కారణంగానే డీవీకే రోడ్డు నుంచి సాగర్‌‌‌‌‌‌‌‌ రింగ్‌‌‌‌‌‌‌‌ రోడ్డు వరకు ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ సమస్య తీవ్రమైంది. ఈ లోగా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి రావడంతో మంత్రి కోమటిరెడ్డి పట్టణంలో ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ సిగ్నల్స్‌‌‌‌‌‌‌‌, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. తాజా ఇష్యూ నేపథ్యంలో భూపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి వైఖరిని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నేతలు తప్పుపడుతున్నారు.