హైదరాబాద్ సిటీ, వెలుగు: ఫోర్త్ సిటీ మార్గంలో మెట్రో స్టేషన్లను ప్రస్తుతం సిటీలో ఉన్న నిర్మాణం కంటే విశాలంగా, వినూత్నంగా నిర్మించనున్నారు. దీనికి సంబంధించి మెట్రో అధికారులు నమూనా చిత్రాన్ని సోమవారం విడుదల చేశారు. ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్ సిటీకి వెళ్లే మార్గంలో 300 ఫీట్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్డు మధ్యలో మెట్రో రైల్వే ట్రాక్, మెట్రో స్టేషన్లను నిర్మించనున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న సర్వీస్ రోడ్డులో రెండు మెట్రో స్టేషన్లతో పాటు పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నారు.
సర్వీస్ రోడ్డులో ఇరువైపులా ఉన్న మెట్రో స్టేషన్ల నుంచి ఫుట్ ఓవర్ బ్రిడ్జి ద్వారా రోడ్డు మధ్యలో ఉన్న మెట్రో రైల్ ను చేరుకునేలా ప్లాన్ చేశారు. మొత్తం 40 కిలో మీటర్ల దూరంలో మూడు రకాలుగా మెట్రో ప్రయాణించనుంది. ఎయిర్‌పోర్టు వద్ద అండర్‌గ్రౌండ్, ఆ తర్వాత ఎలివేటెడ్, ఫోర్త్ సిటీకి వచ్చే మార్గంలో స్కిల్ యూనివర్సిటీ వద్ద రోడ్డుకు సమాన ఎత్తులో (మెట్రో స్టేషన్ ఎట్ గ్రేడ్) మెట్రోను నిర్మించనున్నారు. ఇక్కడ మెట్రో రోడ్డు లెవల్ లో ప్రయాణించనుంది. ఎట్ గ్రేడ్ ప్రయాణం మెట్రోలో ప్రయాణిస్తున్నవారికి, రోడ్డు మీద వాహనాల్లో వెళ్తున్నవారికి సరికొత్త అనుభూతిని అందించనుంది.