వరంగల్‌ టూరిజానికి.. మిస్​వరల్డ్​ జోష్..!​

వరంగల్‌ టూరిజానికి..  మిస్​వరల్డ్​ జోష్..!​
  • మే 7 నుంచి 31 వరకు పోటీలు
  • 150 దేశాల అందగత్తెలు, పారిశ్రామికవేత్తల రాక 
  • 25 రోజుల పాటు కళకళలాడనున్న ఉమ్మడి వరంగల్‍ పర్యాటక కేంద్రాలు 
  • ఓరుగల్లు టూరిజాన్ని ప్రపంచ మీడియాకు చూపడానికి అద్భుతావకాశం

వరంగల్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్​లో మిస్‍ వరల్డ్​ పోటీలకు ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో ఓరుగల్లు టూరిజానికి నయా జోష్​ రానుంది. మే 7 నుంచి 31 వరకు నిర్వహించనున్న పోటీలకు దాదాపు 150 దేశాలకు చెందిన అందగత్తెలు, ఈవెంట్​ నిర్వాహకులు, మీడియా ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో 25 రోజుల పాటు తెలంగాణ బ్రాండ్‍ పెంచేలా ఇక్కడి కళలు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్‍ చేస్తామని, హైదరాబాద్‍ వచ్చే పర్యాటకులను ఓరుగల్లు పర్యాటకం చూపిస్తామని సీఎం రేవంత్​రెడ్డి ఇటీవల తెలిపారు. దీంతో ఇక్కడి టూరిజాన్ని ప్రపంచ మీడియాకు చూపడానికి అద్భుత అవకాశం రానున్నది. ఓరుగల్లు టూరిజం ఆకట్టుకోవాలంటే ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. 

టాప్​లో ఓరుగల్లు టూరిజం..

రెండు తెలుగు రాష్ట్రాల జనాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉండటంతో ఓరుగల్లు టూరిజం ప్రాంతాలు సోషల్‍ మీడియాలో చాలా ఫేమస్ అయ్యాయి. ఆలయాలు, సరస్సులు, అభయారణ్యాలతో టెంపుల్అండ్ ఎకో టూరిజంగా గుర్తింపు ఉంది. యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం, గ్రేటర్ సిటీలో ఉన్న వెయ్యిస్తంభాల గుడి, ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి ఆలయం టెంపుల్‍ టూరిజంలో ఫేమస్ అవగా, కాకతీయ కళావైభవం, ఖిలా వరంగల్, మేడారం సమ్మక్కసారక్క గిరిజన జాతర తెలుసుకోడానికి విదేశీ పర్యాటకులు ఆసక్తి చూపే అవకాశముంది. ఇవేగాక లక్నవరం, పాకాల సరస్సులు, పాండవుల గుట్టలు, తాడ్వాయి అభయారణ్యం ఒక సర్కిట్లో అందుబాటులో ఉన్నాయి. సిటీలో భద్రకాళి బండ్, కాళోజీ కళాక్షేత్రం ఉంది. 

పెట్టుబడులకు అవకాశం..

మిస్ వరల్డ్ పోటీలు ఇప్పటివరకు 71సార్లు జరగగా, దేశంలో ముంబై కేంద్రంగా ఒకసారి నిర్వహించారు. 72వ పోటీలు హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకు మొదటిసారి అవకాశం దక్కింది. 140 దేశాల కంటెస్టెంట్లతోపాటు ఆయా దేశాల్లో విభిన్నరంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, డాక్టర్లు, ఇంజినీర్లు, కళాకారులు, న్యాయవాదులు తరలిరానున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‍ తర్వాత రెండో రాజధాని స్థాయిలో వరంగల్ అన్నివిధాలా ముందుంది. విద్యాపరంగా ఎన్ఐటీ, కేయూ, కాళోజీ, గిరిజిన యూనివర్సిటీలున్నాయి. హెల్త్​ పరంగా ఎంజీఎంతోపాటు సూపర్‍ కేఎంసీ స్పెషాలిటీ హాస్పిటల్, మెడికల్‍ కాలేజీలున్నాయి. 

24 అంతస్తుల హాస్పిటల్‍ రెడీ అవుతోంది. పారిశ్రామికపరంగా మెగా కాకతీయ టెక్స్​టైల్‍ పార్కులో ఇప్పటికే మూడు ప్రముఖ కంపెనీలు పనిచేస్తున్నాయి. కాజీపేటలో కోచ్‍ ఫ్యాక్టరీ పనులు నడుస్తుండగా, లేటెస్టుగా మామునూర్ ఎయిర్‍పోర్ట్​ నిర్మాణానికి గ్రీన్‍ సిగ్నల్ రావడంతో రాష్ట్రంలోనే ఓరుగల్లుకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. దీంతో విదేశీ పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోలిగితే ఓరుగల్లుకు పెట్టుబడులొచ్చే అవకాశం ఉంది. 

గ్రేటర్‍ టూరిజంపై నిర్లక్ష్యం..! 

ఉమ్మడి వరంగల్​లో చారిత్రక, కళాత్మక వారసత్వ సంపద, కట్టడాలకు ఎకో టూరిజంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ విదేశీ టూరిస్టులు ఇక్కడి పర్యాటక ప్రాంతాలకు వచ్చేసరికి డిసప్పాయింట్అవుతున్నారు. అధికారులు సిటీ పరిధిలో ఉండే కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్​లో శిల్పసంపదను కాపాడలేకపోతున్నారు. సౌండ్​ అండ్‍ లైటింగ్‍ షో ఏరోజు ఉంటుందో తెలియని దుస్థితి. రాత్రి సమయాల్లో కలర్‍ఫుల్‍ లైటింగ్‍పై పర్యవేక్షణ లేక చీకట్లే ఉంటున్నాయి. వెయ్యిస్తంభాల గుడిలో వేసవిలో కనీసం ఐదు నిమిషాలు గడపలేని దుస్థితి ఉంది. భద్రకాళి బండ్‍ రెండో దశ పనులు ఏండ్లతరబడి నడుస్తూనే ఉన్నాయి. 

మ్యూజికల్‍ గార్డెన్ 20 ఏండ్లుగా మూతపడగా, పున:ప్రారంభ పనులు సాగుతున్నాయి. భద్రకాళి చెరువు పూడికతీత పనులు నడుస్తుండటంతో చెరువు ఎండిపోయింది. కాళోజీ కళాక్షేత్రంలో అంతేస్థాయిలో కార్యక్రమాలు జరగట్లేదు. కాకతీయులు తవ్వించిన మెట్ల బావులు కళ్లముందరే ఉన్నా కాపాడలేకపోతున్నారు. వరంగల్‍ శివనగర్‍ మెట్ల బావి పున:ప్రారంభ పనులు ఇంకా పూర్తికాలేదు. ఈ క్రమంలో రాష్ట్ర సర్కారుతోపాటు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ చూపాలని, ప్రపంచ మీడియాకు మన టూరిజాన్ని చూపడానికి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రజలు డిమాండ్​ చేస్తున్నారు.