![శివరాత్రి ముందే సమ్మర్ మొదలైంది.. హైదరాబాదీలు బీ అలర్ట్](https://static.v6velugu.com/uploads/2025/02/hyderabad-to-witness-first-intense-heat-spell-of-summer-season-from-today_NZptQi5RfI.jpg)
ఫిబ్రవరి నెల మొదలైందో లేదో.. అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. మాములుగా అయితే.. శివరాత్రి తర్వాత ఎండలు మొదలవ్వాలి కానీ... ఈ ఏడాది 10 రోజుల ముందే సమ్మర్ మొదలైంది. ఉదయం పూట వాతావరణం కాస్త చల్లగానే ఉంటున్నప్పటికీ 9 గంటలు దాటగానే భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ వాసుల మాడు పగిలిపోయే వార్త ఒకటి తెలుస్తోంది... హైదరాబాద్ లో ఈరోజు ( ఫిబ్రవరి 11, 2025 ) నుండి ఎండలు మండిపోనున్నాయి.
హైదరాబాద్ లో శివరాత్రికి ముందే ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు టచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు వాతావరణ శాస్త్ర నిపుణులు అంచనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
హైదరాబాద్ లో తీవ్ర వేడిగాలులు:
హైదరాబాద్ లో 38 డిగ్రీల ఉష్ణోగ్రతతో తీవ్రమైన ఎండ, వేడిగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 20 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని తెలుస్తోంది. ఫిబ్రవరి 20 తర్వాత పరిస్థితిలో కాస్త మార్పు ఉంటుందని.. ఎండలు, వేడిగాలుల నుండి కాస్త రిలీఫ్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read : సైంటిఫిక్ వే..గుడ్డును పర్ఫెక్ట్గా ఉడికించడం ఎలా?
పెరిగిన ఉష్ణోగ్రతలు:
గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సోమవారం ( ఫిబ్రవరి 10, 2025 ) ఆదిలాబాద్‌లో అత్యధికంగా 37.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా.. హైదరాబాద్ లో అత్యధికంగా 35.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. సమ్మర్ సీజన్ కి 10రోజుల ముందే తీవ్రమైన వేడిగాలుల పరంపర మొదలైన క్రమంలో హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. బయటికి వెళ్లే సమయంలో స్కార్ఫ్ లు, గొడుగులు తీసుకొని వెళ్లాలని.. డీహైడ్రేషన్ కి గురి కాకుండా వీలైనంత ఎక్కువ నీళ్లు తాగాలని సూచిస్తున్నారు అధికారులు.