అర్థిక క్రమశిక్షణలో తమకు ఎవరూ సాటిరారని నిరూపించారు హైదరాబాద్ వాసులు. పొదుపు, ఖర్చులో నెంబర్ వన్ గా ఉన్నారని ది గ్రేట్ ఇండియన్ వాలెట్ తన అధ్యయనంలో వెల్లడించింది. సంవత్సరానికి 5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న 2,500 దిగువ మధ్యతరగతి కుటుంబాలను సర్వే చేసింది. ఇందులో హైదరాబాద్ తరువాత పుణే రెండో స్థానంలో నిలిచింది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో దిగువ మధ్యతరగతి నివాసితుల సగటు నెలవారీ ఆదాయం రూ.44,000 కాగా, పూణేలో రూ.39,000.ఇక స్థిర వ్యయాల పరంగా కూడా హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది, నివాసితుల సగటు నెలవారీ ఖర్చులు రూ.19,000 నుండి రూ.24,000కి చేరాయి. కరోనా మహమ్మారి తర్వాత బాగా పెరిగిన ఖర్చులలో ఇంటి అద్దెలు కూడా ఉన్నాయి, ఇవి కనీసం 30% పెరిగాయని నిపుణులు తెలిపారు.
నగర జనాభాలో 69 శాతం మంది ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా పొదుపు వైపు మొగ్గు చూపుతున్నట్లు అధ్యయనంలో తేలింది. నెలవారీ ఖర్చుల విషయానికొస్తే విహారయాత్రలకు 35శాతం, బయటి ఫుడ్ కు 19శాతం, ఫిట్‌నెస్‌కు 6శాతం, ఓటీటీ యాప్‌లకు 10శాతం, విద్యకు 15 శాతం ఖర్చు చేస్తున్నారు.
గత ఆరు నెలల్లో 57శాతం మంది దుస్తులు, ఇతర అవసరమైన వస్తువులనే కొనుగోలు చేశారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక 26 శాతం మంది నగరవాసులు తమ ఆర్థిక సమాచారాన్ని స్మార్ట్‌ఫోన్ లో నిక్షిప్తం చేస్తుండగా 25 శాతం మంది ఈ వివరాలను తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకుంటున్నారని అధ్యయనంలో వెల్లడించింది.