హైదరాబాద్: దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. చార్మినార్ పక్కనే ఉన్న శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక అడ్వైజరీ జారీ చేశారు. నవంబర్ 6 నుంచి 11వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. పండుగ షాపింగ్‌తో పాటు ఆలయ దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ కారణంగా చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.
ఈ మూడు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
- చార్మినార్ వైపు వచ్చే మూడు ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.
- మదీనా – చార్మినార్: మదీనా నుంచి చార్మినార్ వైపు వచ్చే వాహనాలను అవసరాన్ని బట్టి ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించనున్నారు.
- ముర్గీ చౌక్ – చార్మినార్: ఈ మార్గంలో వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు.
- రాజేష్ మెడికల్ హాల్ – షా అలీ బండ – చార్మినార్: ఈ రహదారిలోనూ ట్రాఫిక్ రద్దీని బట్టి ఆంక్షలు, మళ్లింపులు చేపట్టనున్నారు.
- ఈ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు వీలైనంత వరకు ప్రత్యామ్నాయ రహదారులను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు తమ వాహనాలను రోడ్లపై ఇష్టానుసారంగా పార్కింగ్ చేయకుండా పోలీసులు ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను కేటాయించారు.
- మీర్‌చౌక్ వైపు నుంచి వచ్చేవారు: ముఫీద్ ఉల్ అనామ్ స్కూల్ గ్రౌండ్, సర్దార్ మహల్ రోడ్.
- షా అలీ బండ వైపు నుంచి వచ్చేవారు: చార్మినార్ బస్ టెర్మినల్ పార్కింగ్, యునాని ఆసుపత్రి ప్రాంగణం.
- మదీనా, నాయాపూల్ వైపు నుంచి వచ్చేవారు: SYJ కాంప్లెక్స్, గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్, కాలీ కమాన్ (ఆదివారం మాత్రమే).
- పురానాపూల్, బేగంబజార్ వైపు నుంచి వచ్చేవారు: MJ బ్రిడ్జ్, గవర్నమెంట్ సిటీ కాలేజ్, కులీ కుతుబ్ షా స్టేడియం.
- హుస్సేనీ ఆలం వైపు నుంచి వచ్చేవారు: న్యూ ముర్గీ చౌక్, ఖిల్వత్ రోడ్, ఝులూ ఖానా, లాడ్ బజార్ సమీపంలోని ఖిల్వత్ రోడ్, ఖిల్వత్ గ్రౌండ్.
- భక్తులు పోలీసుల సూచనలను పాటిస్తూ కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనాలను నిలపాలని అధికారులు కోరారు.
వాహనదారులు ఈ జాగ్రత్తలు తీసుకోండి
దీపావళి పండుగ సందర్భంగా లాడ్ బజార్, చార్మినార్, మదీనా ప్రాంతాల్లో షాపింగ్ చేసే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడవచ్చు. చార్మినార్ పరిసరాల మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలి. అత్యవసరం కాని ప్రయాణాలను రద్దీ సమయాల్లో వాయిదా వేసుకోవడం మంచిది. ట్రాఫిక్ సైన్ బోర్డులు, విధుల్లో ఉన్న పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలి.
