ఎల్బీ స్టేడియంలో బుధవారం (అక్టోబర్ 9, 2024) జరగబోయే డీఎస్సీ కొలువుల పండగకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఎంపికైన అభ్యర్థులకి డీఎస్సీ ఉత్తర్వులు ఇవ్వనున్నారు. ఈ కారణంగా.. మంగళవారం ఎల్బీ స్టేడియం వైపుగా వచ్చే వారికి ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఏఆర్ పెట్రోల్ బంక్ జంక్షన్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే ట్రాఫిక్ని ఏఆర్ వద్ద డైవర్ట్ చేసి నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు మళ్ళించనున్నారు.
బషీర్బాగ్ నుంచి ఏఆర్ జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్ని పెట్రోల్ బంక్, బీజేఆర్ విగ్రహం వద్ద ఎస్బీఐ, అబిడ్స్, నాంపల్లి స్టేషన్ రోడ్డు వైపు డైవర్ట్ చేయనున్నారు. రవీంద్ర భారతి నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను ఏఆర్ వద్ద మళ్లించనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఎల్బీ స్టేడియం వైపు వెళ్లే నగరవాసులు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో ట్రాఫిక్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ ‘ఎక్స్’ ఖాతాలో అప్డేట్ చేస్తుంటుందన్న సంగతి తెలిసిందే.
అక్టోబర్ 12న దసరా పండుగ కావడంతో హైదరాబాద్ నుంచి సద్దుల బతుకమ్మ, దసరా పండుగులకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా టీజీఎస్ఆర్టీసీ కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ పండుగలకు రాష్ట్రవ్యాప్తంగా 6304 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. హైదరాబాద్లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్బీనగర్ ఆరాంఘర్, కూకట్ పల్లి, గచ్చిబౌలి, బోయిన్ పల్లి, జగద్గిరిగుట్ట, సుచిత్ర, ఐఎస్ సదన్, బోరబండ, శంషాబాద్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంప్లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను కల్పించాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.