![సమ్మర్ కిట్లు ఇవ్వండి..హైదరాబాద్‌లో మార్చిలోనే మండుతున్న ఎండలు](https://static.v6velugu.com/uploads/2024/03/hyderabad-traffic-police-constables-asked-to-give-summer-kits_zIwBYa2Jq7.jpg)
- తట్టుకోలేకపోతున్న ట్రాఫిక్ కానిస్టేబుల్స్
- డ్యూటీ చేస్తుండగా అనారోగ్యాల బారినపడుతూ..
- ఉపశమనం కోసం కూల్ కిట్లు ఇవ్వాలంటున్నరు
హైదరాబాద్,వెలుగు : సిటీలో కొద్దిరోజులుగా ఎండలు మండిపోతున్నాయి. మార్చిలోనే 40 డిగ్రీల టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఎండలను తట్టుకుని నిలబడుతూనే వాహనాలను కంట్రోల్చేస్తున్నారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే మిట్ట మధ్యాహ్నం కూడా నడిరోడ్డుపై ఆన్ డ్యూటీలో ఉంటున్నారు. ప్రధాన జంక్షన్లలో అంబ్రెల్లాలు ఉన్నప్పటికీ సిగ్నల్ డ్యూటీ చేయాల్సిదే. లేదంటే ట్రాఫిక్ జామ్ లు అవడం ఖాయం.
దీంతో ఓ వైపు ఉక్కపోత, మరోవైపు మండే ఎండలు ట్రాఫిక్ పోలీసులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. మరికొందరు ఎండలకు తట్టుకోలేక అనారోగ్యం పాలవుతున్నారు. దీంతో సమ్మర్ కిట్స్ఇవ్వాలంటున్నారు. ఈసారి ఎండలు ముందస్తుగా మండుతుండటంతో.. ప్రతి ఏడాది ఇచ్చే సమ్మర్కిట్లను త్వరగా అందించాలని పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నారు.
ఎండ తీవ్రతతో అనారోగ్యాల బారిన..
మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో సుమారు 5 వేల మందికి పైగా ట్రాఫిక్ పోలీసులు డ్యూటీలు చేస్తున్నారు. వీరిలో3 వేల మంది రోడ్లపై పాయింట్ డ్యూటీలో ఉంటున్నారు. ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, కానిస్టేబుల్స్, హోంగార్డులు షిఫ్ట్‌ల వారీగా విధులు నిర్వహిస్తుంటారు. కొన్ని సిగ్నిల్స్ వద్ద అంబ్రెల్లా కింద కూర్చొని డ్యూటీ చేయొచ్చు. మరికొన్ని చోట్ల పాయింట్లో నిలబడే డ్యూటీ చేయాలి. లేదంటే ట్రాఫిక్కంట్రోల్చేయడం కష్టం.
అలాంటి సిగ్నల్స్‌వద్ద పనిచేసే ట్రాఫిక్ సిబ్బంది ఎండలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బైక్స్‌మీద తిరుగుతూ ట్రాఫిక్ ను పర్యవేక్షించే సిబ్బంది కూడా ఎండ వేడికి తట్టుకోలేకపోతున్నామని, ఉపశమన చర్యలు తీసుకోవాలంటున్నారు. వయసులో పెద్దవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండ, దుమ్ము, ధూళికి తట్టుకొని నిలబడాలంటే కష్టంగా ఉందంటున్నారు. కొన్నిరోజులుగా మాస్కులు కూడా ఇవ్వట్లేదని మరికొందరు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.
ముందుగానే ఇవ్వాలంటూ..
ప్రతి ఏటా వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు సమ్మర్ కిట్లు ఇస్తుంటారు. ఈసారి మార్చిలోనే భానుడు భగభగమంటున్నాడు. ఇక సమ్మర్కిట్లను కూడా ముందుగానే ఇవ్వాలని సిగ్నల్స్‌వద్ద డ్యూటీలు చేసే ట్రాఫిక్కానిస్టేబుల్స్కోరుతున్నారు. సమ్మర్కిట్లలో వాటర్ బాటిల్, ఓఆర్‌ఎస్, గ్లూకోజ్ డి, గాగుల్స్, హెల్మెట్, విఫెల్టెట్ జాకెట్, షూస్ ఇస్తారు. వీటితో పాటు షిఫ్ట్‌లో ఉన్న వారికి రోజుకు రెండు సార్లు మజ్జిగ, నిమ్మరసం, రాగి జావ కూడా ఇస్తారు. ఎండలు ముదరడంతో సమ్మర్కిట్లను కూడా త్వరగా ఇవ్వాలంటున్నారు.
కిట్స్ ఇస్తే.. రిలాక్స్ అవుతాం
అప్పుడే ఎండలు ముదిరాయి. కొద్దిసేపు నిల్చోగానే ఎండకు తట్టుకోలేకపోతున్నాం. చెమటలు, ఉక్కపోత, దుమ్ము, ధూళి.. అన్నింటికి తట్టుకొని నిలబడాలంటే కష్టంగా ఉంది. ప్రతి ఏడాది సమ్మర్ కిట్స్ఇస్తారు. ఈసారి ముందుగానే ఇస్తే రిలీఫ్ గా ఉంటుంది.
– ట్రాఫిక్ కానిస్టేబుల్, బంజారాహిల్స్