
- ప్రాణాలతో బయటపడ్డ కూతురు
బషీర్‌బాగ్, వెలుగు: స్కూటీపై షాపింగ్‌కు వెళ్తున్న తల్లీకూతుళ్లను ఆర్టీసీ ఎలక్ట్రిక్బస్సు ఢీకొట్టింది. బస్సు టైర్ల కింద నలిగి తల్లి చనిపోగా, స్వల్ప గాయాలతో కూతురు బయటపడింది. ఈ ఘటన బషీర్ బాగ్ గోల్కొండ హ్యాండీ క్రాఫ్ట్స్ ముందు జరిగింది. ఖైరతాబాద్ కు చెందిన బీబీ జైనాబ్(43), కూతురు జునేరా (20)తో కలిసి షాపింగ్చేసేందుకు మంగళవారం మధ్యాహ్నం తమ హోండా యాక్టీవా బైక్‌పై కోఠి బయలుదేరారు. జునేరా డ్రైవ్ చేస్తుండగా, జైనాబ్ వెనుకాల కూర్చొని ఉంది. బషీర్బాగ్గోల్కొండ హ్యాండీ క్రాఫ్ట్స్ వద్ద బైక్అదుపు తప్పింది. పక్కగా వెళ్తున్న హెచ్‌సీయూ డిపోకు చెందిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు వీరిని ఢీకొట్టుకుంటూ వెళ్లింది.
బస్సు వెనుక టైర్ల కింద పడిన జైనాబ్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. స్వల్ప గాయాలతో బయటపడ్డ జునేరా.. కళ్ల ముందే చనిపోయిన తల్లిని చూసి షాక్‌కు గురైంది. ‘అమ్మీ.. లే అమ్మీ..’ అంటూ తల్లిని లేపుతూ కన్నీమున్నీరైంది. అప్పటివరకు తనతో మాట్లాడుతూ వస్తున్న తల్లిని విగత జీవిగా చూసి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అబిడ్స్ పోలీసులు జునేరాను ప్రైవేట్హాస్పిటల్కు తరలించారు. జైనాబ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుమన్ తెలిపారు.