ఇద్దరు పోలీసులు లంచం తీసుకుంటూ పట్టుబడిన సంఘటన హైదరాబాద్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సరూర్‌నగర్ మహిళా పోలీస్ స్టేషన్‌కు చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ సరళ, హెడ్ కానిస్టేబుల్ నరసింహ తీసుకుంటూ పట్టుబడ్డారు.
లంచం ఆశించింది కూడా బయట వ్యక్తి నుంచి అనుకుంటే పొరబడినట్లే. డిపార్ట్ మెంట్ లోని ఓ వ్యక్తి నుంచే లంచం అడగడం గమనార్హం. కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న రాము ఓ క్రిమినల్ కేసులో నిందితుడిగా ఉన్నాడు.
తనపై కేసు నమోదు కాకుండా చూడాలని సరళ, నరసింహను అతను కోరాడు. వారిరువురు అతని నుంచి లంచం డిమాండ్ చేశారు. రూ.5 వేలు ఇస్తేనే కేసు నమోదు చేయకుండా ఉంటామని చెప్పడంతో హోంగార్డు ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు.
అధికారులు ఓ సీల్డ్ కవర్ లో రూ.5 వేలు పెట్టి హోంగార్డుకి ఇచ్చారు. దాన్ని అతను తీసుకెళ్లి సరళ, నరసింహకు ఇచ్చారు. డబ్బులు ఇస్తున్న టైంలోనే సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఏసీబీ అధికారులు నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
లంచం తీసుకున్న ఇద్దరిపై కేసు నమోదు చేసి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరు పరిచినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే 1064 నంబర్ లో సంప్రదించాలని పోలీసులు సూచించారు.