- 3 రాష్ట్రాల పోలీసుల జాయింట్ ఆపరేషన్స్
- 10 స్పెషల్ టీమ్స్‌తో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న పోలీసులు
- అఫ్జల్‌గంజ్ నుంచి సికింద్రాబాద్ తిరుమలగిరి వరకు వెళ్లినట్టు గుర్తింపు
- నాలుగు ఆటోలు మార్చిన దుండగులు.. చత్తీస్గఢ్ లేదా బిహార్ వెళ్లినట్టు అనుమానం
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లో కలకలం రేపిన అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పది ప్రత్యేక బృందాలతో హైదరాబాద్ సహా రాయ్‌పుర్, బిహార్‌లోని అనుమానిత ప్రాంతాల్లో పోలీసుల గాలింపు కొనసాగుతున్నది. పాత నేరస్తుల డేటా ఆధారంగా సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు. కాల్పులు జరిపిన అనంతరం దొంగల ముఠా అఫ్జల్ గంజ్ నుంచి సికింద్రాబాద్ తిరుమలగిరి వరకు వెళ్లినట్టు గుర్తించారు. ఇందుకోసం నాలుగు ఆటోలను చేంజ్ చేసినట్టు సీసీటీవీ ఫుటేజీల ద్వారా తెలుసుకున్నారు. తిరుమలగిరి నుంచి చత్తీస్‌గఢ్ వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు.
ఈ క్రమంలోనే చత్తీస్‌గఢ్, ఏపీ, కర్నాటక పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు. కర్నాటకలోని బీదర్, ఆ తర్వాత హైదరాబాద్‌లో దొంగల ముఠా కాల్పులతో బీభత్సం సృష్టించింది. బీదర్‌లో ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపి నగదుతో పరారై హైదరాబాద్ కు చేరుకున్నారు. అఫ్జల్‌గంజ్ నుంచి ప్రైవేటు ట్రావెల్స్‌లో రాయ్‌పుర్ వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ట్రావెల్స్ సిబ్బంది బ్యాగులు తనిఖీ చేయడం, కట్టలకొద్దీ డబ్బును చూసి అనుమానంతో ప్రశ్నించడంతో నిందితులు ఒకరిపై రెండు రౌండ్ల కాల్పులు జరిపి పరారయ్యారు.
చత్తీస్‌గఢ్ మీదుగా బిహార్ వెళ్లారా ?
కాల్పుల ఘటనను సీపీ సీవీ ఆనంద్ సీరియస్‌గా తీసుకున్నారు. సిటీ లా అండ్ ఆర్డర్, టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ పోలీసులు సహా మొత్తం 10 స్పెషల్ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. కర్నాటక, ఏపీ పోలీసులతో జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కాల్పులు జరిగిన రోషన్ ట్రావెల్స్ పరిసర ప్రాంతాలు, అఫ్జల్‌గంజ్ బస్‌స్టాప్, ఎంజీబీఎస్‌లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌లను సేకరించారు. నాలుగు ఆటోలు మారుతూ..ట్యాంక్‌బండ్ మీదుగా సికింద్రాబాద్ అక్కడి నుంచి తిరుమలగిరిలోని ట్రావెల్స్కు చేరుకున్నట్టు గుర్తించారు.
ఈ క్రమంలోనే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సహా లాడ్జీలు, హోటల్స్‌లో సోదాలు జరిపారు. కానీ దుండగుల జాడ మాత్రం లభించలేదు. కాల్పులు, దోపిడీకి పాల్పడింది బిహార్,యూపీ గ్యాంగ్‌గా అనుమానిస్తున్నారు. పథకం ప్రకారమే బిహార్ అమిత్‌కుమార్ గ్యాంగ్ పేరుతో ఫేక్ ఫోన్ నంబర్ ఇచ్చి టికెట్స్ బుక్ చేసుకున్నట్టు కనుగొన్నారు. దోపిడీ అనంతరం హైదరాబాద్ మీదుగా చత్తీస్‌గఢ్ అక్కడి నుంచి బిహార్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుని ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.