హైదరాబాద్- విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఘొర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద వాటర్ ట్యాంకర్ ను ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ప్రమాదంలో 40 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక కామినేని ఆసుపత్రికి తరలించారు. స్థానికుల ద్వారా ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ ఘటనతో రోడ్డుపై భారీ ట్రాఫిక్ జాం అయింది.
మేము హైదరాబాద్ సీబీఎస్ బస్ స్టాప్ లో కోదాడ వెళ్లే బస్సు ఎక్కాము. ఎల్బీనగర్ దగ్గరకు వచ్చేసరికి బస్సు మొత్తం జనాలతో నిండిపోయింది. నార్కెట్ పల్లి మండలంలోని ఏపీ లింగోటం దగ్గర బస్సు ముందు వాటర్ ట్యాంకర్ వెళ్తోంది. అయితే దానిని క్రాస్ చేసి ముందుకు వెళుదామనుకున్న బస్సు డ్రైవర్.. వాటర్ ట్యాంకర్ ను బలంగా బస్సుతో ఢీకొట్టాడు. దీంతో వాటర్ ట్యాంకర్ పక్కన ఉన్న డివైడర్ పైకి ఎక్కింది. బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనతో మేమంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాము. ఏం జరిగిందో తెలుసుకోలేకపోయాము. తేరుకొని చూసేసరికి బస్సులో దాదాపు సగం మందికిపైగా తీవ్రంగా గాయాలయ్యాయి. గాయలయిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. వారందరిని కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
- ప్రత్యక్ష సాక్షి..