ఓటు ఎంత విలువైందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఓటు హక్కు అంటే ఒక విధంగా నీకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడమే కాదు..నచ్చిన సమాజాన్ని ఏర్పరుచుకోవడం, సమాజం పట్ల మనకున్న బాధ్యతను చెబుతుంది. నిజంగా సమాజం పట్ల మనకెంత బాధ్యత ఉందనేది ఓటు హక్కుతో చూపించవచ్చు. కానీ ప్రస్తుతం హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ చూస్తే..గ్రేటర్ ఓటర్లకు పూర్తిగా సామాజిక బాధ్యత లోపించినట్లు కనిపిస్తోంది.. పోలింగ్ కేంద్రాలన్నీ ఖాళీగా ఉంటున్నాయి. గ్రేటర్ లో దాదాపు 74 లక్షల ఓటర్లు ఉంటే కనీసం సగం మంది కూడా ఓటు వేయడానికి వస్తలేరు. కొన్ని చోట్ల వృద్ధ ఓటర్లు మార్నింగ్ నుంచే క్యూ లైన్లో ఉండి ఓటు వేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఓటు వేయడానికి వెళ్లిన వందలాది మంది ఓట్లు గల్లంతయ్యాయి.
ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పార్టీలు, ఎన్నికల కమిషన్ ఎన్నో విధాలుగా సూచించింది. ఓటు వేసేందుకు పోలింగ్ రోజున ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులకు హాలిడే కూడా ప్రకటించింది. కానీ ఇవేమి పట్టనట్టుగా గ్రేటర్ ఓటర్లు ఇంటి నుంచి బయటకు రావడం లేదు..ఓటు వేయడానికి ఆసక్తి చూపడం లేదు. హాలీడేను జాలీడే గా యూజ్ చేసుకుంటున్నారు గ్రేటర్ ఓటర్లు.2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 45 శాతం పోలింగ్ నమోదైంది కానీ.. ఈ సారి పోలింగ్ ముగిసే సరికి కనీసం 40 శాతం కూడా నమోదవుతుందా? అనే అనుమానం కల్గుతోంది. మరీ ఇంత తక్కువ పోలింగ్ నమోదు కావడం చూస్తే గ్రేటర్ ఓటర్ కు బద్దకస్తమా? లేక సమాజం పట్ల బాధ్యత లేదా? అనే సందేహం కల్గుతోంది. ముఖ్యంగా యువత ఓటు వేయడానికి ఆసక్తి చూపడం లేదు.
ఓటు వేయడానికి అరకు నుంచి వచ్చా : సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్
పోలింగ్ పట్ల నిరాశచెందా. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత .నేను అరకు నుంచి వచ్చి ఓటేశా.. హైదరాబాద్ లో ఉన్న వాళ్లు కూడా ఓటు వేయడానికి రావట్లేదు. ఓటు వేయకపోతే ప్రశ్నించే హక్కు కోల్పోతాం..ఖచ్చితంగా ఓటు వేయాలి.