- 4 జిల్లాల్లో 10 డిగ్రీలలోపే నమోదు
- ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అత్యల్పంగా 7.9 డిగ్రీలు
- 29 జిల్లాల్లో 14 డిగ్రీలలోపే టెంపరేచర్లు
- పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
- మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి ఉండే చాన్స్
హైదరాబాద్, వెలుగు: చలితో రాష్ట్రం గజగజలాడుతున్నది. రాత్రి టెంపరేచర్లు విపరీతంగా పడిపోతుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ 15 డిగ్రీల కన్నా తక్కువ టెంపరేచర్లే రికార్డు అవుతున్నాయి. ఏజెన్సీ ఏరియాలతోపాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి.కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా నమోదవుతున్నది.
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డిల్లో 10 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అత్యల్పంగా 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా అర్లిటిలో 9.2, కామారెడ్డి జిల్లా డోంగ్లిలో 9.5, సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో 9.7 డిగ్రీల చొప్పున కనిష్ట టెంపరేచర్లు రికార్డయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా, వికారాబాద్ జిల్లాల్లో 10.1, నిజామాబాద్, మెదక్లో 10.2, నిర్మల్ జిల్లాలో 10.3, రంగారెడ్డి జిల్లాలో 10.6, జగిత్యాలలో 10.7 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మొత్తంగా 29 జిల్లాల్లో 14 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
మిగతా జిల్లాల్లో 15 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. హైదరాబాద్ నగరంలోనూ అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. శేరిలింగంపల్లిలో అత్యల్పంగా 11.6 డిగ్రీల కనిష్ట టెంపరేచర్ నమోదైంది.దీంతో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ALSO READ : చెన్నై వైపు వేగంగా దూసుకొస్తున్న తుఫాన్.. సముద్రం అల్లకల్లోలం.. ఆకాశంలో కారుమబ్బులు
దక్షిణాదిన 4 జిల్లాల్లో తక్కువ చలితీవ్రత
రాష్ట్రంలోని 4 దక్షిణాది జిల్లాల్లో టెంపరేచర్లు కాస్తంత ఎక్కువగానే రికార్డవుతున్నాయి. సూర్యాపేట, ఖమ్మం, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. మిగతా అన్ని జిల్లాల్లోనూ 14 డిగ్రీలలోపు రికార్డవుతున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కంటిన్యూ అవుతుండగా.. మరో 25 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతున్నది.
ఉత్తర భారతం నుంచి వీస్తున్న గాలులతో రాష్ట్రంలో టెంపరేచర్లు భారీగా పడిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. మరికొద్ది రోజులపాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
జిల్లా టెంపరేచర్
సిర్పూర్ (ఆసిఫాబాద్) 7.9 డిగ్రీలు
అర్లి టి (ఆదిలాబాద్) 9.2 డిగ్రీలు
డోంగ్లి (కామారెడ్డి) 9.5 డిగ్రీలు
న్యాల్కల్ (సంగారెడ్డి) 9.7 డిగ్రీలు