నల్లా కనెక్షన్ల అప్లికేషన్లు డబుల్.. ఔటర్​ వరకూ విస్తరించడంతో పెరుగుతున్న డిమాండ్

నల్లా కనెక్షన్ల అప్లికేషన్లు డబుల్.. ఔటర్​ వరకూ విస్తరించడంతో పెరుగుతున్న డిమాండ్
  • వాటర్​ బోర్డుకు నెలకు 4 వేల అప్లికేషన్లు 
  • గతంలో 2,500 అప్లికేషన్లు
  • సంఖ్య పెరగడంతో ప్రాసెస్​ ఆన్​లైన్ ​చేసిన బోర్డు 
  •  నెలనెలా బోర్డుకు రూ.20 కోట్లకుపైగా ఆదాయం

హైదరాబాద్​సిటీ, వెలుగు: వాటర్​ బోర్డు సేవలను ఔటర్​ రింగ్ రోడ్​ వరకు విస్తరించడంతో అక్కడి మున్సిపాలిటీలు, గ్రామాల నుంచి తాగునీటి కోసం దరఖాస్తులు పెరుగుతున్నాయి. గ్రేటర్​పరిధిలో ఇప్పటికే 9,300 కి.మీ మేర తాగునీటి పైప్​లైన్​ వ్యవస్థ విస్తరించి ఉంది. ఈ పరిధిని మరింత పెంచుకునేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలతో నీటి సరఫరాకు డిమాండ్​పెరుగుతోంది. ఓఆర్ఆర్ ​పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతోపాటు గ్రామ పంచాయతీలకు వాటర్​ బోర్డు నీటి సరఫరా చేస్తోంది. ఆయా ప్రాంతాల్లో కొత్తగా నీటి కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

ప్రత్యేకించి భూగర్భ జలాలు పడిపోయిన సందర్భాల్లో, వేసవి కాలంలో మెట్రోవాటర్​బోర్డు సరఫరా చేసే నీటిపైనే ఆధారపడాల్సి వస్తోంది. దీంతో తప్పనిసరిగా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్​ తీసుకుంటున్నారు. కొత్త కనెక్షన్లు మంజూరు చేసేందుకు ఏర్పాటు చేసిన సింగిల్​విండో సెల్​కు పెరుగుతున్న దరఖాస్తుల తాకిడిని తట్టుకునేందుకు అధికారులు ఆన్​లైన్​ సిస్టమ్​ తీసుకువచ్చారు. కొత్త కనెక్షన్​ కావాలంటే ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. 

కొత్త కనెక్షన్లతో మరింత ఆదాయం

బోర్డు పరిధిలో13.80 లక్షల నల్లా కనెక్షన్లు ఉండగా ఇందులో 90 శాతం డొమెస్టిక్​ కనెక్షన్లే. మిగిలిన10 శాతంలో కమర్షియల్, మల్టీస్టోరుడ్, ఇండస్ట్రియల్​కనెక్షన్లు ఉన్నాయి. ఇవే కాకుండా కొన్ని మున్సిపాలిటీలు, కంటోన్మెంట్, గ్రామ పంచాయితీలకు బోర్డు బల్క్​గా వాటర్​సప్లయ్​ చేస్తోంది. శివారు ప్రాంతాల్లో కొత్త కాలనీలు వెలుస్తున్న నేపథ్యంలో రెండేండ్ల కింది వరకు నెలకు 2 వేల నుంచి 2500 దరఖాస్తులు వచ్చేవి.

ఏడాది నుంచి నెలకు 3 వేల నుంచి 4 వేల వరకు దరఖాస్తులు వస్తున్నాయి. దీంతో బోర్డుకు ఆదాయం కూడా పెరుగుతోంది. గతంలో నెలకు రూ.12 కోట్ల నుంచి రూ.15 కోట్ల ఆదాయం రాగా, ప్రస్తుతం కొత్త కనెక్షన్ల ద్వారా రూ. 20 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. వినియోగదారుల నుంచి నీటి బిల్లుల రూపంలో నెలకు రూ.90కోట్ల నుంచి రూ.100 కోట్ల ఆదాయం వస్తుండగా, కొత్త కనెక్షన్ల ద్వారా మరింత ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 

ఆన్​లైన్​ ద్వారానే దరఖాస్తుల స్వీకరణ

గతంలో కొత్త కనెక్షన్​ కావాలంటే ఆ ప్రాంత డివిజన్​ఆఫీసుల్లో అప్లై చేసుకుంటే సరిపోయేది. అధికారులు అవసరమైన పత్రాలను స్క్రూటినీ చేసి సింగిల్​విండో సెల్​కు పంపేవారు. విండోలో మళ్లీ పత్రాలను పరిశీలించి కనెక్షన్​మంజూరు చేసేవారు. కానీ, రోజు రోజుకూ కనెక్షన్ల కోసం ఎక్కువ దరఖాస్తులు వస్తుండడంతో నేరుగా సింగిల్​విండోసెల్​కే ఆన్​లైన్​ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

ALSO READ : కేటీ ఆర్​ఏ1 ఫార్ములాఈ రేసుపై ఏసీబీ కేసు

www.hyderabawater.gov.in లో అప్లై చేసుకున్న తర్వాత ఆఫీసర్లు అడిగిన పేపర్లు చూపించాలి. తర్వాత 15 రోజుల్లో కనెక్షన్​మంజూరు చేస్తూ మెసేజ్​ పంపిస్తారు. అప్పుడు ఫీజు చెల్లిస్తే బోర్డులోని గ్రీన్​బ్రిగేడ్​ బృందాలు వచ్చి నల్లా కనెక్షన్​ఇస్తాయి. ప్రభుత్వం పేదల కోసం ప్రారంభించిన ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్​కూడా ఇస్తున్నారు. తెల్ల రేషన్​కార్డు ఉన్న వారికి దీనిని వర్తింపజేస్తున్నారు.