![ఔటర్ ప్రజల దాహం తీర్చేలా..శివారులో మినీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు](https://static.v6velugu.com/uploads/2025/02/hyderabad-water-board-focuses-on-providing-adequate-drinking-water-to-areas-within-outer-ring-road_9eDxCTqgVY.jpg)
- రూ.6.25 కోట్లతో హిమాయత్ సాగర్, గండిపేట, మంచిరేవులలో నిర్మాణం పూర్తి
- వీటి నుంచి ఓఆర్ఆర్ ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా
హైదరాబాద్‌సిటీ, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని ప్రాంతాలకు సరిపడా తాగునీటిని అందించడంపై వాటర్‌బోర్డు ఫోకస్పెట్టింది. ఓఆర్ఆర్ను ఆనుకుని ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీలు, గేటెడ్ కమ్యూనిటీలు, టౌన్షిప్లకు నేరుగా నీటి సరఫరా చేసేందుకు ఇప్పటివరకు సరైన పైప్‌లైన్ వ్యవస్థ లేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో జనాలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు.
వేసవిలో సమస్య తీవ్రమై వేల సంఖ్యలో వాటర్ ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్నారు. నీటి సమస్యకు చెక్‌పెట్టేందుకు కొత్తగా హిమాయత్ సాగర్, గండిపేట, మంచి రేవులలో వాటర్‌బోర్డు ప్రెషర్ఫిల్టర్లు(మినీ వాటర్ ట్రీట్‌మెంట్‌ప్లాంట్లు) ఏర్పాటు చేసింది. 5 ఎంఎల్డీల కెపాసిటీతో ఒక ప్లాంట్, 3 ఎంఎల్డీల కెపాసిటీతో రెండు ప్లాంట్లను నిర్మించింది.
రిజర్వాయర్ల నుంచి నేరుగా రా వాటర్‌ను ఈ ఫిల్టర్స్లోకి పంపి శుద్ధి చేస్తారు. తర్వాత పరిసర గ్రామాలు, గేటెడ్ కమ్యూనిటీలు, టౌన్షిప్లకు ట్రాక్టర్ల ద్వారా సరఫరా చేస్తారు. ఈ ప్రెషర్ ఫిల్టర్స్ తక్కువ స్థలంలో, తక్కువ ఖర్చుతో నిర్మించారు. మూడు ప్లాంట్లకు కేవలం రూ. 6.25 కోట్లు మాత్రమే ఖర్చయ్యిందని వాటర్ బోర్డు అధికారులు తెలిపారు. అవసరాన్ని బట్టి మరికొన్ని చోట్ల ఏర్పాటు చేస్తామని అంటున్నారు.
నీటి సరఫరాపై ప్రభావం పడకుండా..
సాధారణంగా ఫిబ్రవరిలోనే నీటికి డిమాండ్పెరిగి ట్యాంకర్లు బుక్ చేసుకునే వారి సంఖ్య కూడా అధికమవుతుంది. గత ఏడాది ఫిబ్రవరిలో రోజుకు 3,500 నుంచి 4 వేల ట్యాంకర్లు బుక్కాగా, ఈసారి 5,500 వరకు బుక్అవుతున్నాయి.
ఈ లెక్కన మే నెలలో రోజుకు 11 వేల నుంచి 12 వేలకు చేరే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఔటర్ప్రాంతాల్లోనే ఎక్కువ బుకింగ్స్వస్తుండడంతో నీటి సరఫరాపై ప్రభావం చూపించకుండా ఉండేందుకు ప్రెషర్ ఫిల్టర్లను ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు.