ఆ ప్రాంతాల్లో నీళ్లకు ఎందుకంత డిమాండ్?

ఆ ప్రాంతాల్లో నీళ్లకు ఎందుకంత డిమాండ్?
  • గత వేసవిలో భారీగా ట్యాంకర్లు బుక్​ చేసిన ప్రాంతాల్లో సర్వే
  • ఒక్కో డివిజన్​కు ఇన్​చార్జీగా ఒక్కో ఆఫీసర్​  
  • నల్లా లేకుండా సీవరేజీ వాడుతున్న వారిని గుర్తించి సెస్​ వసూలు చేసే ప్లాన్​

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్​లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలతో పాటు నల్లా కనెక్షన్​లేకుండా సీవరేజీ లైన్​ఉపయోగిస్తున్న వారిని గుర్తించేందుకు వాటర్​బోర్డు ఆఫీసర్లు ఫీల్డ్​విజిట్​చేయాలని నిర్ణయించారు. గత వేసవిలో భారీ సంఖ్యలో ట్యాంకర్లను బుక్​ చేసిన ఏరియాల్లో పర్యటించి ఆ ప్రాంతాల్లో నీటికి డిమాండ్​ఎందుకు ఏర్పడిందన్న విషయాన్ని తెలుసుకునేందుకు సర్వే నిర్వహించనున్నారు.

శేరిలింగంపల్లి, కూకట్​పల్లి, కొండాపూర్, నార్సింగి, కోకాపేట, నానక్​రామ్​గూడ, హైటెక్​సిటీ వంటి ప్రాంతాల్లో గత వేసవిలో రోజుకు వేల సంఖ్యలో ట్యాంకర్లు బుక్​చేసుకున్నారు. దీంతో ఇక్కడ ఒక్కో డివిజన్​కు ఒక్కో ఆఫీసర్​ను ఇన్​చార్జీగా నియమించి వచ్చే నెల నుంచి సర్వే చేయనున్నారు. దీనిద్వారా వేసవి ప్రారంభం నాటికి సమస్యలు పరిష్కరించి నీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూడాలన్నది తమ ప్రధాన ఉద్దేశమని అధికారులు చెప్తున్నారు. 

అక్రమ సీవరేజీ లైన్లను వినియోగిస్తున్న వారిపై నజర్​

జంట నగరాల్లో నీటి కనెక్షన్​ లేకుండా కేవలం వాటర్​బోర్డుకు చెందిన సీవరేజీ లైన్లను వినియోగించుకుంటున్న వారిని గుర్తించేందుకు కూడా సర్వే చేయనున్నారు. గ్రేటర్​ లో చిన్న, పెద్ద ఫంక్షన్ హాళ్లు 18,500 వరకు ఉంటాయని అంచనా. వీటిలో 60 శాతానికి పైగా ఫంక్షన్​హాళ్లలో నల్లా కనెక్షన్లు లేవని, అయినా వీరు సీవరేజీ లైన్లు ఉపయోగిస్తున్నారని గుర్తించారు. నల్లా కనెక్షన్​ఉన్నవారైతే వాటర్​బిల్లులోనే సీవరేజీ సెస్​కలిపి వస్తుంది.

కానీ, నల్లా లేకుండా కొనసాగుతున్న ఫంక్షన్​హాళ్ల వల్ల బోర్డుకు నష్టం వస్తున్నది. దీంతో తనిఖీ చేసి సీవరేజీ సెస్​వసూలుచేయాలని నిర్ణయించారు. కొన్ని ప్రైవేట్​ హాస్పిటళ్లు​కూడా నల్లా కనెక్షన్​ లేకుండా సీవరేజీ ఉపయోగిస్తుండడంతో గుర్తించి సీవరేజీ సెస్​వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.