కాసులిస్తే కావాల్సినన్ని నీళ్లు .. వాటర్​బోర్డు లైన్​మెన్ల దందా

కాసులిస్తే కావాల్సినన్ని  నీళ్లు .. వాటర్​బోర్డు లైన్​మెన్ల దందా
  • పైసలు తీస్కుని ఎక్కువ ప్రెషర్​తో ఎంతసేపైనా నీళ్లు
  • ఒక్కొక్కరి పరిధిలో 6 వేల నల్లా కనెక్షన్లు
  • గతంలో ఫిర్యాదులతో సిబ్బంది సస్పెన్షన్లు 
  • రిపీట్​ కాకుండా దృష్టి పెట్టాలన్న ఎండీ 

హైదరాబాద్ సిటీ, వెలుగు :వేసవిలో నీటికి డిమాండ్​పెరిగే అవకాశం ఉండడంతో అందరి దృష్టి వాటర్​బోర్డు లైన్​మెన్లపైనే పడుతోంది. గత ఎండా కాలంలో వీరిపై పలు ఆరోపణలు వచ్చాయి. డబ్బులిస్తే ఎంతసేపైనా నీటిని వదులుతున్నారని, ఎక్కువ ప్రెషర్​తో నీటిని వదలడంతో పలు కాలనీలకు, బస్తీలకు నీళ్లు అందట్లేదని ఫిర్యాదులు వచ్చాయి. ఆయా ప్రాంతాల్లో వాల్వ్ లు తిప్పి నీటి సరఫరా చేయడం, తర్వాత మూసివేయడం లైన్​మెన్ల పని. కానీ, వారి చేతివాటం వల్ల నగరంలో చాలా మందికి నిర్ణీత సమయం నీటి సరఫరా కావడం లేదు.

 కొన్నిసార్లు ప్రెషర్​ కూడా తగ్గుతోంది. కొన్ని ప్రాంతాల్లో లైన్​మెన్లు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తూ పెద్ద మొత్తంలో ముడుపులు దండుకుంటున్నారు. డబ్బులు తీసుకున్న ప్రాంతాల్లో ఎక్కువ టైం నీళ్లు వచ్చేలా, ప్రెషర్​ బాగుండేలా చూస్తున్నారు. దీంతో మిగిలిన ప్రాంతాల వారు  ఇబ్బందులు పడుతున్నారు. ఎండాకాలం సమీపిస్తుండడంతో లైన్​మెన్ల పనితీరును కనిపెట్టాలని, నీటి సరఫరాలో వ్యత్యాసం రాకుండా చూడాలని వాటర్​బోర్డు ఎండీ ఆదేశాలు జారీ చేశారు. వారి చేతిలోనే కిటుకంతా దాగి ఉండడంతో ప్రత్యేకంగా ఎండీ రంగంలోకి దిగి ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. 

నగరంలో 57 వేల వాల్వ్​లు

వాటర్​బోర్డులో లైన్​మెన్ల కొరత ఉంది. గ్రేటర్ పరిధిలో 57,500 వాల్వ్ లు ఉండగా ఆపరేట్ చేసేందుకు 2,700 మంది మాత్రమే ఉన్నారు. మరో 500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్కో వాల్వు పరిధిలో 250 నుంచి 300 కనెక్షన్లు ఉన్నాయి. దీంతో ఉన్న వారినే మరికొన్ని ప్రాంతాలకు కేటాయిస్తుండడంతో ఎండాకాలంలో కొందరు లైన్​మెన్లు అందినకాడికి దండుకుంటున్నారు. కమర్షియల్, సంపన్న వర్గాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వారికి కాసుల పంట పండుతోంది. ప్రస్తుతం ఒక్కో లైన్​మెన్​పరిధిలో 6 వేల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. 

జూబ్లీహిల్స్, మణికొండలో.. 

వాటర్​బోర్డు పరిధిలో నీటి సరఫరా చేసే వాల్వ్​లకు ఉండే థ్రెడ్స్​ను ఎంత మేరకు ఎత్తాలన్నది ముందే నిర్ణయిస్తారు. కానీ, కొందరు లైన్​మెన్లు డబ్బులు వచ్చిన ప్రాంతాల్లో నిర్ణయించిన దానికంటే ఎక్కువ థ్రెడ్స్​పైకి ఎత్తుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ప్రెషర్​తో నీరు వస్తోంది.

 నీటి సమస్యలున్న ప్రాంతాల్లో కూడా ఈ దందా సాగుతున్నా ఉన్నతాధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. గత వేసవిలో జూబ్లీహిల్స్, మణికొండ ప్రాంతాల్లో లైన్​మెన్లపై ఇలాంటి ఫిర్యాదులు రావడంతో సదరు లైన్​మెన్లను సస్పెండ్​చేశారు. దీంతో ఈసారి కూడా ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉండడంతో వాటర్​బోర్డ్​ఎండీ అలర్ట్​అయి ఆదేశాలు జారీ చేశారు.  

అక్రమ కనెక్షన్లు కూడా..

కొందరు లైన్​మెన్లు ఒకడుగు ముందుకేసి రాత్రికి రాత్రే అక్రమ కనెక్షన్​లు కూడా ఇస్తున్నట్టు సమాచారం. దీని వల్ల వాటర్​బోర్డుకు నెలకు దాదాపు రూ.10 కోట్ల వరకు ఆదాయానికి గండి పడుతోంది. ముఖ్యంగా వాటర్​ ఆడిట్​ చేపట్టకపోవడంతో ఎంత నీరు సరఫరా అవుతోంది? ఎంత ఆదాయం వస్తుందన్నది లెక్కతేలడం లేదు.