
- నీటి సరఫరాలో లో–ప్రెషర్‌కు చెక్ పెట్టేలా చర్యలు
- తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించినా..
- ఈ నెల 15 నుంచి వాటర్ బోర్డు స్పెషల్ డ్రైవ్ మొదలు
హైదరాబాద్ సిటీ, వెలుగు:నల్లాలకు మోటార్లను బిగించి నీటిని తోడితే రూ.5 వేల ఫైన్ వేసి మోటర్ సీజ్‌చేస్తామని, మూడోసారి దొరికితే కనెక్షన్కట్ చేస్తామని వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం వాటర్‌బోర్డు హెడ్డాఫీసులో ఓ అండ్ ఎమ్ సీజీఎం, జీఎంలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ బోర్డు ఎన్నో వ్యయప్రయాసలతో సుదూర ప్రాంతాల నుంచి నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తున్నామని, కొంతమంది మోటర్లతో ఎక్కువ నీటిని గుంజుకొని తాగునీటి అవసరాలకు కాకుండా ఇతర అవసరాలకు వాడుకుంటున్నారన్నారు.
ఇప్పటికే సిటీలో భూగర్భ జలాలు అడుగంటిపోగా వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగిందన్నారు. నల్లాలకు మోటార్లు బిగించడంతో ఇతర ప్రాంతాల వినియోగదారులకు లో ప్రెషర్ తో నీటి సరఫరా అవుతూ ఇబ్బందులు పడుతున్నారని, వారికి తిప్పలు తప్పించడానికే తాము రంగంలోకి దిగుతున్నామని స్పష్టం చేశారు.
మోటార్లతో 60 శాతం మందికి సమస్య
60 శాతం మంది నల్లాలకు మోటర్లు బిగిస్తుండడంతో హైప్రెషర్‌తో నల్లా నీరు సరఫరా అవుతోంది. మోటరు లేని 40 శాతం మంది వినియోగదారుల్లో 20 శాతం మందికి సాధారణంగా, మరో 20 శాతం మందికి లో–పెష్రర్‌తో నీరు సరఫరా అవుతుండడంతో మెట్రో కస్టమర్ సెంటర్(ఎంసీసీ)కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో బోర్డు థర్డ్ పార్టీ ద్వారా ఆరా తీసింది. ఇందులో ఎక్కువమంది నీటి సరఫరా టైంలో నల్లాలకు మోటర్లు బిగిస్తున్నట్లు తేలింది. సాధారణ మోటర్లతోపాటు లేటెస్ట్గా మార్కెట్లో వచ్చిన ఆటోమేటిక్ మోటర్లు వాడుతుండడంతో దిగువ, చివరి కనెక్షన్‌దారులకు అంతంత మాత్రంగానే నీటిసరఫరా అవుతోందని తెలిసింది.
15 నుంచి తనిఖీలు షురూ
‘మోటర్ ఫ్రీ ట్యాప్ వాటర్’ లక్ష్యంగా ఈ నెల15 నుంచి స్పెషల్ డ్రైవ్ అమలు చేయాలని వాటర్‌బోర్డు నిర్ణయించింది. నల్లా నీటి సరఫరా టైంలో లైన్మెన్ నుంచి ఎండీ వరకు అంతా ఫీల్డ్‌కు వెళ్లి తనిఖీలు చేయనున్నారు. ఇది వేసవి ముగిసే వరకు కొనసాగనున్నది. మొదటిదశలో లైన్మెన్లు వాటర్ వాల్వ్ తిప్పగానే సరఫరా చేసే లైన్లలో కనెక్షన్ టూ కనెక్షన్ పరిశీలించి వాటర్ ప్రెషర్, మోటర్ల వినియోగాన్ని గుర్తిస్తారు.
రెండో దశలో రోజు విడిచి రోజు సెక్షన్ మేనేజర్ అదే లైన్లో నల్లా నీటిసరఫరా..మోటర్ల వినియోగాన్ని గుర్తించి రూ.5 వేలు ఫైన్విధించి మోటర్ సీజ్ చేస్తారు. క్యాన్ నెంబర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెడుతారు. రెండు సార్లు దొరికితే ఫైన్‌తో సరిపెడతారు. మూడోసారి దొరికితే కనెక్షన్కట్చేసి పడేస్తారు. ఫీల్డ్‌విజిట్‌లో భాగంగా ఎవరైనా సమగ్ర పరిశీలన జరపకుండ తప్పుడు నివేదిక ఇస్తే మోమో ఇవ్వనున్నారు.
ఫైన్ కోసం స్పెషల్ యాప్
నల్లాలకు మోటర్లను బిగించి నీటిని తోడుతున్న వారికి జరిమానా విధించడానికి, నీటిని తాగడానికి కాకుండా ఇతర అవసరాలకు వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి స్పెషల్యాప్ను వాటర్‌బోర్డు రూపొందించింది. ఈ యాప్ ద్వారా నల్లాలకు మోటర్లను బిగించినా, తాగునీటిని ఫ్లోర్లు కడగడానికి, వాహనాలు శుభ్రం చేయడానికి, గార్డెనింగ్, ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి ఓవర్ ఫ్లో, నిర్మాణ పనుల కోసం వినియోగిస్తే యాప్‌ద్వారా కంప్లయింట్చేయొచ్చు. రెండు రోజుల్లో ఈ యాప్ ను అందుబాటులోకి తేనున్నారు. మొదటి, రెండోసారి వేసిన ఫైన్‌ను సదరు వినియోగదారుడి కనెక్షన్ అకౌంట్ కు జమ చేస్తారు. ఇది వచ్చే నెల బిల్లులో చెల్లించవచ్చు.
కంప్లయింట్చేయండి
తక్కువ ప్రెషర్‌తో నీరు సరఫరా అయినా, నీటి సరఫరాలో ఇతర సమస్యలు తలెత్తినా.. మేనేజర్, డీజీఎం, జీఎం లకు కంప్లయింట్చేయవచ్చు. లేకపోతే జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313కి ఫోన్‌చేసి ఫిర్యాదు చేసినా యాక్షన్ తీసుకుంటాం. – అశోక్‌రెడ్డి, వాటర్ బోర్డు జీఎం