డెక్కన్ చార్జర్స్ స్థానంలో 2013లో ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్. బరిలోకి దిగిన తొలి సీజన్‌లోనే ప్లేఆఫ్స్ చేరి ఆకట్టుకున్న రైజర్స్ నాలుగేండ్లలోనే తన టార్గెట్‌ను అందుకుంది. 2016లో టైటిల్‌ను సొంతం చేసుకుంది. తర్వాతి నాలుగు ఎడిషన్లలోనూ ప్లేఆఫ్స్ చేరి ఓసారి రన్నరప్‌గానూ నిలిచిన హైదరాబాద్ ఆట ఆ తర్వాత పూర్తిగా గాడి తప్పింది. 2021 నుంచి మూడు సీజన్లలో లీగ్‌లో చివరి స్థానం కోసం పోటీ పడుతోంది. కెప్టెన్లను మార్చినా, ఆటగాళ్లను మార్చినా, కొత్త కోచ్‌లను తెచ్చినా ఆ జట్టు రాత మారడం లేదు. ఈ సారి ఎలాగైనా సత్తా చాటాలన్న పట్టుదలతో మరోసారి భారీ మార్పులతో 17వ సీజన్‌కు రెడీ అయింది. కొత్త కెప్టెన్, కొత్త కోచ్‌ను నియమించి పలువురు కొత్త ప్లేయర్లను టీమ్‌లోకి తీసుకొని బరిలోకి దిగుతోంది. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను రికార్డు రేటుకు కొనుగోలు చేసింది. అతనికే కెప్టెన్సీ అప్పగించింది. కమిన్స్ రాకతో అయినా రైజర్స్ రాత మారుతుందేమో చూడాలి.
మూడు సీజన్లలో మూడో కెప్టెన్
2021 సీజన్ మధ్యలో ఆస్ట్రేలియన్ డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించినప్పటి నుంచి సన్ రైజర్స్‌కు ఏదీ కలిసి రావడం లేదు. ఆ మార్పు బెడిసికొట్టి 2021 సీజన్‌ను సన్ రైజర్స్ చివరి స్థానంతో ముగించింది. 2022లో వార్నర్‌ను టీమ్ నుంచి రిలీజ్ చేసి విలియమ్సన్ కెప్టెన్సీలో ముందుకెళ్లినా ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అవ్వలేక 8వ స్థానంతో సరిపెట్టింది. గతేడాది విలిమయ్సన్ కూడా జట్టును వీడగా సౌతాఫ్రికా స్టార్ ఐడెన్ మార్‌క్రమ్‌కు సారథ్యం ఇచ్చింది. కానీ, అతని కెప్టెన్సీలో జట్టు మరింత నిరాశ పరిచింది. గత సీజన్‌లో నాలుగు మ్యాచ్‌ల్లోనే నెగ్గి చివరి స్థానానికి పడిపోయింది. దాంతో ఎస్‌ఏ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుకు వరుసగా రెండు టైటిళ్లను అందించినప్పటికీ మార్‌క్రమ్‌ను కెప్టెన్‌గా తప్పించి కమిన్స్‌ను కొత్త కెప్టెన్‌గా ప్రకటించింది. గతేడాది కమిన్స్ ఆస్ట్రేలియాకు డబ్ల్యూటీసీ, వన్డే వరల్డ్ కప్ రూపంలో రెండు ఐసీసీ టైటిళ్లను అందించాడు. అతని రాకతో జట్టుకు అదృష్టం కలిసి వస్తుందని రైజర్స్ యాజమాన్యం నమ్మకంగా ఉంది. కానీ, అత్యుత్తమ టీ20 క్రికెట్‌లో కమిన్స్ కెప్టెన్సీ చేపట్టడం ఇదే తొలిసారి. ఇక, టీ20ల్లో వరల్డ్ నంబర్ 2 బౌలర్ వానిందు హసరంగను వేలంలో రూ.1.5 కోట్ల ధరకే దక్కించుకుంది. మరోవైపు వరుసగా మూడో ఏడాది రైజర్స్ తమ కోచ్‌ను మార్చింది. వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా స్థానంలో న్యూజిలాండ్‌కు చెందిన డేనియల్ వెటోరిని కొత్త హెడ్ కోచ్‌గా నియమించింది.
ఇండియా బ్యాటర్లే బలహీనత
గత సీజన్ మాదిరిగా ఈసారి కూడా పేరున్న, ఫామ్‌లో ఉన్న ఇండియన్ బ్యాటర్లు జట్టులో లేకపోవడం రైజర్స్ బలహీనత కానుంది. మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి ఉన్నా.. వీరిలో ఒక్కరూ గత సీజన్‌లో 300 రన్స్ మార్కును దాటలేకపోయారు. వీళ్లు సత్తా చాటితేనే ఈసారి జట్టు ముందుకెళ్లగలదు. అదే సమయంలో సన్ రైజర్స్ టీమ్‌లో స్ట్రయికింగ్ ఇండియన్ స్పిన్నర్ కనిపించడం లేదు. సుందర్ పవర్‌ప్లే బౌలర్ కాగా, షాబాజ్ మంచి ఆల్-రౌండర్ ఆప్షన్. కానీ, ఈ ఇద్దరూ ఒక సీజన్‌లో ఎనిమిది వికెట్లకు మించి తీయలేదు. ఈ నేపథ్యంలో గత సీజన్‌లో 12 వికెట్లు పడగొట్టిన లెగ్‌స్పిన్నర్ మయాంక్ మార్కండే కీలకం కానున్నాడు. వెటరన్ పేసర్ భువనేశ్వర్, నటరాజన్ పెద్దగా ఫామ్‌లో లేరు. స్పీడ్ స్టర్ ఉమ్రాన్ మాలిక్ కూడా నేషనల్ టీమ్‌కు దూరమై టచ్ కోల్పోయాడు.
ఫారినర్సే బలం
వేలంలో పేరున్న ఫారిన్ క్రికెటర్లను ఎంచుకోవడంలో రైజర్స్ సక్సెస్ అయింది. ఈసారి వాళ్ల బలంతోనే లీగ్‌లోకి వస్తోంది. వరల్డ్ కప్ ఫైనల్ హీరో ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, గ్లెన్ ఫిలిప్స్, మార్‌క్రమ్‌లతో బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. కమిన్స్, హసరంగ, మార్కో జాన్సెన్ రూపంలో అద్భుతమైన ఆల్‌రౌండర్లు ఉన్నారు. ఫాస్ట్ బౌలర్ ఫజల్ హాక్ ఫరూకీ వీరికి బ్యాకప్‌గా ఉండనున్నాడు. హసరంగకు తోడు కొత్తగా వచ్చిన షాబాజ్ అహ్మద్, టీమ్‌లో చోటు నిలుపుకున్న వాషింగ్టన్ సుందర్ స్పిన్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించగలరు. ఫారిన్ ప్లేయర్లంతా ఈ సీజన్‌కు అందుబాటులో ఉండనుండటం రైజర్స్‌కు ప్లస్ పాయింట్. ప్రస్తుతానికి టీమ్‌కు గాయాల సమస్య కూడా లేదు.
సన్ రైజర్స్ టీమ్:
ఇండియన్స్: మయాంక్ అగర్వాల్, అన్మోల్‌ప్రీత్, అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, ఉపేంద్ర, అభిషేక్ శర్మ, షాబాజ్ అహ్మద్, సుందర్, సంవీర్ సింగ్, నితీష్ రెడ్డి, ఆకాష్ సింగ్, భువనేశ్వర్, మయాంక్ మార్కండే, నటరాజన్, ఝతావేద్, ఉమ్రాన్ మాలిక్, జైదేవ్ ఉనద్కత్.
ఫారినర్స్: కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, ఐడెన్ మార్‌క్రమ్, క్లాసెన్, గ్లెన్ ఫిలిప్స్, హసరంగ, మార్కో జాన్సెన్, ఫజల్హాక్ ఫరూఖీ.
బెస్ట్ పెర్ఫామెన్స్- 2016లో చాంపియన్